అవ్వాతాతల పెన్షన్ కు పీఠముడి!

Update: 2021-12-01 05:42 GMT
పెన్షన్ లబ్ధిదారులకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) గుబులు రేపుతోంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఓటీఎస్‌ చెల్లించకుంటే పింఛన్‌ నిలిపేస్తారన్న భయం లబ్దిదారుల్లో మొదలైంది. ప్రతి నెలా 1 నుంచి 4 వతేదీ మధ్య పెన్షన్ లు పంపిణీ చేస్తున్నారు. డిసెంబరు నెలకు సంబంధించి బుధవారం నుంచి పెన్షన్ పంపిణీ జరగనుంది.

ఓటీఎస్‌ చెల్లించని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు నిలిపివేయాలని జిల్లాలో కొన్ని మండలాల్లో అనధికారిక ఆదేశాలు వచ్చినట్టు ప్రచారం జరుగడంతో లబ్దిదారుల్లో ఆందోళన మొదలైంది. తెల్లారితే పింఛన్లు ఇస్తారా? ఇవ్వరా? అనే ఆందోళనలో అవ్వాతాతలున్నారు.

1983 నుంచి 2013 వరకూ గృహ నిర్మాణ లబ్ధిదారులు రూ.10 వేలు చెల్లించి సంపూర్ణ గృహ హక్కు పొందాలని అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఈ పథకానికి ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని చెబుతున్నారు. ఇప్పటికే తమ సొంతమైన వాటిపై హక్కు కల్పించడం ఏమిటని అధికారులను నిలదీస్తున్నారు.

ఎక్కడిక్కడ అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి మండలానికి ఓటీఎస్‌ వసూళ్ల లక్ష్యాన్ని నిర్ధేశించడంతో అధికారులకు తలనోప్పిగా మారింది. మండల స్థాయి అధికారి నుంచి గ్రామ స్థాయి సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల వరకూ లక్ష్యాన్ని పెడుతున్నారు. సచివాలయం పరిధిలో నిత్యం కనీసం 10 మందికి తక్కువ లేకుండా ఓటీఎస్‌ వసూళ్లు జరిగేలా చూడాలి నిబంధన పెట్టారు.

గృహ నిర్మాణంలో ఓటీఎస్‌ పథకం కింద రూ. 10,000 చెల్లించాలని లబ్ధిదారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. రూ.10 వేలు చెల్లించని లబ్ధిదారులు, కుటుంబ సభ్యులకు డిసెంబర్ నెల పెన్షన్‌ నిలిపివేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో వాలంటీర్లకు గ్రామ సచివాలయ సిబ్బంది ఆదేశాలు ఇచ్చింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం ద్వారా లబ్ది పొందుటకు చెల్లించవలసిన రూ. 10,000 చెల్లించని వారి కుటుంబసభ్యులకు డిసెంబర్ నెల పెన్షన్ ను నిలిపివేయాలని గ్రామవాలంటీర్లకు సంతబొమ్మాళి కార్యదర్శి ఆదేశాలిచ్చారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పింఛన్‌ ఆపేయాలని చెప్పారు.

మొత్తం వసూలుకు వాలంటీర్లనే బాధ్యులని చెప్పారు. ఆదేశాలు ఉల్లంఘించిన వాలంటీర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుటుంబసభ్యుల పెన్షన్, రేషన్ కార్డ్‌ నెంబర్, కుటుంబంలో ఎవరైన ప్రభుత్వ ఉద్యోగి , వాలంటీర్లుగాని ఉంటే వారి వివరాలు తీసుకోవాలని ఆదేశించారు.

అయితే సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శికి జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్ షోకాజ్ జారీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ పథకంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు నోటీసు ఇచ్చామని చెబుతున్నారు. ఓటీఎస్ పథకాన్ని ప్రభుత్వం స్వచ్ఛందగా అమలు చేస్తోందని ఆయన తెలిపారు. అమలు చేయడంలో భాగంగా రేషన్, పెన్షన్ నిలుపుదల చేయనున్నట్లు కార్యదర్శి సర్క్యులర్ లో ప్రకటించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఓటీఎస్ విధివిధానాలను ప్రజలకు తెలియజేయడం ముఖ్యమని చెప్పారు. అవగాహన పొంది స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. దీనిలో ఎటువంటి ఒత్తడి లేదని ఆయన స్పష్టం చేశారు. సర్క్యులర్ జారీ చేసిన కార్యదర్శి డీపీఓ ఎదుట వ్యక్తిగతంగా హజరుకావాలని ఆదేశించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం క్రమశిక్షణా రాహిత్యమని తప్పుబట్టారు.

గతంలో నిర్మించిన ఇళ్లకు సంబంధించి వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) చేసుకోవాలని, లేకుంటే పింఛన్లు రద్దు చేస్తామని అధికారులు బెదిరించడం సరికాదని టీడీపీ తప్పుబడుతోంది. ప్రజలందరినీ వైసీపీ ప్రభుత్వం నిలువుదోపిడి చేస్తోందని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వం దారి దోపిడి దొంగల్ని మించిపోయిందన్నారు. ఓటీఎస్ కట్టని వారింట్లో అవ్వాతాతల పెన్షన్ ఆపేయాలని సర్క్యులర్ ఇవ్వడం, కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోందని లోకేష్ ధ్వజమెత్తారు.





Tags:    

Similar News