ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌కు ద‌క్కే ప్ర‌యోజ‌నాలివే!

Update: 2022-08-24 06:31 GMT
దేశంలో అత్యున్న‌త న్యాయ‌స్థానం.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆగ‌స్టు 26తో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. 2021, ఏప్రిల్ 24న ఆయ‌న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఏడాదికిపైగా ఈ ప‌ద‌విలో ఉన్నారు. ఈ ఏడాది ఆగ‌స్టు 26న ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న నేప‌థ్యంలో ఆ త‌ర్వాత ఆయ‌న (సుప్రీంకోర్టు విశ్రాంత ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా)కు ల‌భించే సౌక‌ర్యాల‌పై ఆస‌క్తి నెల‌కొంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), ఇతర న్యాయమూర్తులకు పదవీ విరమణ చేసిన అనంతరం ఏడాది వరకు సాయుధ భద్రత కల్పిస్తారు. ఈ మేర‌కు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వ్యక్తిగతంగా సదరు న్యాయమూర్తులతోపాటు, వారి నివాసాల వద్ద 24 గంటల భద్రత క‌ల్పిస్తారు. ఈ మేర‌కు కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనాలు, పని పరిస్థితుల చట్టం-1958లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదవీ విరమణ అనంతరం ఆరు నెలల వరకు ఢిల్లీలో అద్దె లేకుండా నివాస సౌకర్యం కల్పిస్తారు. అలాగే విమానాశ్రయాల్లోని సెరిమోనియల్‌ లాంజ్‌ల్లో సుప్రీంకోర్టు, హైకోర్టుల విశ్రాంత ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌కు ప్రోటోకాల్‌ సౌకర్యం కల్పిస్తారు. ఈ మేర‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

అదేవిధంగా పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల వెంట ఉండే డ్రైవర్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌లకు ఏడాదిపాటు పూర్తిస్థాయి జీతభత్యాలు ఇవ్వడానికీ కేంద్ర ప్ర‌భుత్వం అనుమతి ఇచ్చింది.

కాగా ఇప్ప‌టివ‌ర‌కు కేంద్ర స్థాయిలో మాజీ రాష్ట్ర‌ప‌తులు, మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తులు, మాజీ ప్ర‌ధాన‌మంత్రులకు మాత్ర‌మే వారి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కొన్ని సౌక‌ర్యాలు, ప్ర‌యోజ‌నాలు అందుతున్నాయి. ఇప్పుడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన న్యాయ‌మూర్తుల‌కు కూడా వీటిని వ‌ర్తింప‌జేయ‌డం విశేషం.
Tags:    

Similar News