రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిజంగానే కొత్త చిక్కొచ్చి పడింది. కొంతకాలం క్రితం ఆర్బీఐ విడుదల చేసిన కొత్త రూపాయి బిల్లలు... గతంలో వాటి కంటే చాలా చిన్నవిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పాత రూపాయి బిల్లలకు అలవాటు పడ్డ వ్యాపారులు చిన్నగా ఉన్న కొత్త రూపాయి బిల్లలను తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. మన దగ్గర ఈ పరిస్థితి ఏమీ లేదంటారా? ఇక్కడ కాదులెండి... పశ్చిమ బెంగాల్ లోని ఓ నాలుగు జిల్లాల్లో ఈ పరిస్థితితో ఆర్బీఐ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారట.
అసలు విషయంలోకి వస్తే... పశ్చిమ బెంగాల్ లోని నదియా - ముషీదాబాదు - బంకురా - హూగ్లీ జిల్లాలలో ఇప్పుడు కొత్త రూపాయి బిల్లలు తీసుకునేందుకు వ్యాపారులు ససేమిరా అంటున్నారట. ఇదెక్కడ గొడవరా బాబూ అంటూ అక్కడి జనం అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ ఫిర్యాదులతో రంగంలోకి దిగిన స్థానిక అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం బిగించారు. అయితే బంకురా - హుగ్లీలలో మాత్రమే వ్యాపారులు అధికారుల మాటకు తలొంచి పాత రూపాయి బిల్లలతో పాటు కొత్త రూపాయి బిల్లలు కూడా స్వీకరించేందుకు ఎట్టకేలకు అంగీకరించారు.
అయితే నదియా - ముషీదాబాదు జిల్లాల్లో మాత్రం స్థానిక అధికార యంత్రాంగం చెప్పినా కూడా వ్యాపారులు ససేమిరా అన్నారట. దీంతో అధికారులు నేరుగా ఆర్బీఐ అధికారులకు సమస్యను నివేదించారు. దీంతో ఆదరాబాదరాగా అక్కడికి వెళ్లిన ఆర్బీఐ అధికారులకు అక్కడి వ్యాపారులు తమ సమస్యను ఏకరువు పెట్టారు. పాత రూపాయి బిల్లలైతే కాస్తంత పెద్దవిగా ఉన్నాయని, కొత్తగా విడుదల చేసిన రూపాయి బిల్లలు చాలా చిన్నవిగా ఉన్నాయని, ఈ కారణంగానే జనం నుంచి తాము తీసుకునేందుకు నిరాకరిస్తున్నామని చెప్పారు.
అంతేకాకుండా కొత్తగా ఉన్న చిన్న రూపాయి బిల్లలను బ్యాంకులకు తీసుకెళితే... వెయ్యి నాణేలు ఉంటేనే బ్యాంకర్లు వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, అంతకంటే తక్కువగా తీసుకెళితే... బ్యాంకర్లు కూడా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని, ఈ కారణంగానూ తాము కొత్త రూపాయి బిల్లలను తీసుకునేందుకు నిరాకరిస్తున్నామని తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారట. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఆర్బీఐ అధికారులు కొత్తగా ఉన్న రూపాయి బిల్లలు ఎన్ని తీసుకువచ్చినా... ఎంత తక్కువ పరిమాణంలో తీసుకువచ్చినా స్వీకరించాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారట. మరి ఆర్బీఐ ఆదేశాలతోనైనా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/