బెంగళూరులో యువతిని ఆపి..పొట్టి డ్రెస్సు వేసుకోవద్దన్నాడు

Update: 2019-10-09 10:55 GMT
ఎవరేం వేసుకోవాలా ఒకరు చెప్పాలా? పొట్టి డ్రెస్సు వేసుకున్నావెందుకు? ఇంట్లో బట్టలు లేవా? ఇదేమైనా కల్చరా? భారతీయతను నాశనం చేస్తున్నారంటూ కొందరు చెప్పే మాటలపై వినిపించే అభ్యంతరాలు అన్ని ఇన్ని కావు. రోడ్డు మీద వెళుతున్న ఒక యువతి.. పొట్టి డ్రెస్సు వేసుకుందన్న ఆక్షేపణ చేసిన యువకుడి ఉదంతం ఇప్పుడు సంచలనటంగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసింది.

కర్ణాటక రాష్ట్ర రాజధాని.. దేశంలో ఐటీ రంగంలో దూసుకెళుతున్న బెంగళూరు మహానగరంలో చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు కొత్త సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.  ముంబయికి చెందిన 28 ఏళ్ల యువతి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తోంది.

హెచ్ఎస్ఆర్ లేఔట్ లో నివసించే ఆమె.. ఈ మధ్యన తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బైక్ మీద షాపింగ్ కు వెళ్లింది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి.. ఇలాంటి దుస్తులు వేసుకున్నావెందుకు? ఇంట్లో మంచి బట్టలు లేవా? అంటూ ప్రశ్నించాడు. దీంతో.. ఆమె వెంట ఉన్న యువకుడు.. అతనెలా ప్రశ్నిస్తాడని ఎదురుతిరగటమే కాదు.. ఎడాపెడా ప్రశ్నలతో వాయించేశాడు.

ఇండియా డ్రెస్ కోడ్ అంటూ ఏదేదో సోది చెప్పిన అతగాడి మాటల్లో పస లేకపోగా... ఒకరి వ్యక్తిగత అంశాల్లోకి జోక్యం చేసుకోవటం సరికాదన్నమాట వినిపిస్తోంది. తాను జాబ్ చేస్తానని.. ప్రొఫెసర్ గా ఆ యువకుడు చెప్పుకోవటం కనిపించింది. తాను తప్పు చేయటం లేదని.. మంచి దుస్తులు వేసుకోవాలని ప్రాధేయపడినట్లుగా రికార్డులో ఉంది. ఎవరేం బట్టలు వేసుకోవాలో చెప్పటం ఏమిటి? మానసికంగా నువ్వు సరిగా లేవంటూ ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఫైర్ అయ్యాడు.

అతడి మాటల తీవ్రతతో కాస్త తగ్గిన యువకుడు.. భారతీయ సంప్రదాయాన్ని గౌరవించేలా.. ఇక్కడ నిబంధనలు పాటించేలా డ్రెస్ వేసుకోవాలన్నాడు. రూల్స్ ఎక్కడ ఉన్నాయంటూ ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేకపోయాడు. ఇంతలో ఆ యువతి కలుగజేసుకొని నా ఇష్టం ఉన్న డ్రెస్సులు వేసుకుంటా.. అడగటానికి నువ్వెవరు? అని ప్రశ్నించటం.. మరోవైపు ఆ యువతి బాయ్ ఫ్రెండ్ తిట్ల దండకంతో కూడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


Tags:    

Similar News