మీడియా టైకూన్ కమ్ మాజీ మంత్రి ఇంట్లో దొంగల ఆరాచకం

Update: 2021-04-05 08:45 GMT
బెర్నార్డ్ టాపీ. ప్రాశ్చాత్య దేశాల్లో.. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ప్రముఖుడు. ఈ 78 ఏళ్ల పెద్దాయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. మీడియా టైకూన్ మాత్రమే కాదు.. పలు వ్యాపారాలతో పాటు రాజకీయంగా కూడా శక్తివంతుడు. ప్రఖ్యాత అడిడాస్ కు మాజీ యజమాని అయిన ఆయన.. గతంలో మంత్రిగా కూడా పని చేశారు. పారిస్ సమీపంలోని కాంబ్స్ లా విల్లేలో  ఆయన నివాసం.

భార్య డొమినిక్ తో కలిసి ఉండే ఆ విలాసవంతమైన నివాసంలోకి తాజాగా నలుగురు దొంగలు చొరబడ్డారు. ఆపై దాడికి తెగబడ్డారు. భద్రతా సిబ్బంది కన్నుగప్పి మౌలిన్ డి బ్రూయిల్ భవనం మొదటి అంతస్తులోని కిటికీ గుండా లోపలకు ప్రవేశించారు. ఎలక్ట్రికల్ తాళ్లతో కట్టేసి మరీ దాడికి పాల్పడ్డారు. అతి ఖరీదైన రోలెక్స్ వాచీలు.. డైమండ్ ఆభరణాల్ని అపహరించుకుపోయినట్లుగా చెబుతున్నారు.

దొంగల బారి నుంచి తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇవ్వటం ద్వారా ఆయన.. ఆయన సతీమణి పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. 1992లో ఫ్రాంకోయిస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆయన.. పలు వివాదాల్లో సుపరిచితుడు. క్రీడా.. మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన ఆయనకు తోడుగా అవినీతి.. కార్పొరేట్ ఆస్తుల దుర్వినియోగం.. మోసం లాంటివి ఆయనపై ఉన్న ఆరోపణలు.

వీటికి సంబంధించిన కేసులు కోర్టు ఎదుటకు రాగా.. దోషిగా తేలి జైలుశిక్ష కూడా అనుభవించారు. 1997లో జైలు నుంచి విడుదలైన తర్వాత 1993లో ఆడిడాస్ స్పోర్ట్స్ అపెరల్ కంపెనీలో తన వాటాను పరబుత్వ అధీనంలోని ఫ్రెంచ్ బ్యాంకుకు అమ్మటం పెను దుమారంగా మారింది. ఇదిలా ఉండగా 2012లో దక్షిణ ఫ్రెంచ్ పత్రిక లా ప్రోవెన్స్.. ఇతర పత్రికల్ని స్వాధీనం చేసుకున్నారు. మీడియా టైకూన్ గా మారారు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న అతడి ఇంట్లోకి దొంగలు ప్రవేశించి.. దాడికి పాల్పడటంతో పాటు.. పెద్ద ఎత్తున దోచుకెళ్లటం సంచలనంగా మారింది.
Tags:    

Similar News