తన ఆప్తమిత్రుడు - ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎవరైనా కామెంట్ చేస్తే...బీజేపీ జాతీయ అధ్యక్షుడు - ఎంపీ అమిత్ షా ఊరుకుంటారా? చాన్సే లేదు కదా? అదే జరిగింది. అలాంటి ఆసక్తికరమై స్పీచ్ కు పెద్దల సభ వేదిక అయింది. రాజ్యసభలో తాను చేసిన తొలి ప్రసంగంలోనే కాంగ్రెస్ పై అమిత్ షా ఘాటైన విమర్శలు చేశారు. అదే సమయంలో ఈ నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం చేసిన పనులపై ప్రశంసలు కురిపించారు.
రోడ్డుపై ఎవరైనా పకోడీలు అమ్ముకుని రూ.200 సంపాదిస్తే - దానినే ఉద్యోగంగా భావించాలంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగడం - కాంగ్రెస్ సైతం విమర్శలు గుప్పించడంపై అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. దేశంలో పేదలు పకోడాలు అమ్ముకొని బతకాలా అని కాంగ్రెస్ నేత చిదంబరం చేసిన విమర్శలను అమిత్ షా దీటుగా తిప్పికొట్టారు. నిరుద్యోగిగా ఉండే కంటే.. పకోడాలు అమ్ముకొని తలెత్తుకొని జీవించడం చాలా బెటర్ అని షా అన్నారు. అయినా ఓ చాయ్ వాలా దేశ ప్రధాని కాగలిగినప్పుడు.. ఇప్పుడు పకోడాలు అమ్ముకునే వారి పిల్లలు కూడా భవిష్యత్తులో అద్భుతాలు చేస్తారంటూ అమిత్ షా చెప్పారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో దేశానికి చేసిందేంటని ప్రశ్నించారు.
`భారతదేశం 2013 వరకు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసు. ఓ విధానం లేదు. ఆర్మీ తమ అసలైన పరాక్రమం చూపించకుండా వాళ్ల చేతులు కట్టేశారు. కానీ ఈ మూడున్నరేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మోడీ ముందుగా చెప్పినట్లే పేదలు - రైతులు - వెనుకబడిన వర్గాల కోసం కృషి చేస్తున్నారు. మూడున్నరేళ్లలో ఎన్డేయే ప్రభుత్వం చేసిన పనులు చరిత్రలో నిలిచిపోతాయి` అని అమిత్ షా అన్నారు. `55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలించినా.. దేశంలో 60 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. కానీ ఈ మూడున్నరేళ్లలో మేం 31 కోట్ల ఖాతాలు తెరిచాం. అప్పట్లో 77 శాతం జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉండేవి. అవి ఇప్పుడు 20 శాతం కంటే తక్కువే ఉన్నాయి` అని షా చెప్పారు. `అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి 1965 యుద్ధ సమయంలో ఓ పూట పస్తులుండమని పిలుపునిస్తే ప్రజలు విన్నారని, ఇప్పుడు మోడీ పిలుపు మేరకు కోటి మందికిపైగా తమ గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారు` అని షా కొనియాడారు. దీనివల్ల ఉజ్వల యోజన ప్రారంభించి మూడు కోట్ల మందికిపైగా సిలిండర్లు ఇవ్వగలిగామని చెప్పారు.
జీఎస్ టీకి కాంగ్రెస్ వ్యతిరేకమని - రాష్ట్రాల్లో విశ్వాసాన్ని నింపి జీఎస్ టీని తీసుకువచ్చామని అమిత్ షా చెప్పారు. దీనిని గబ్బర్ సింగ్ టాక్స్ అంటూ కొందరు ఎద్దేవా చేయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పన్నులతో వచ్చిన సొమ్ములతో ఉచితంగా గ్యాస్ - కరెంట్ వంటివి ఇచ్చామని - సైనికులకు ఉపయోగించామని - రైతులకు వెచ్చిస్తున్నామని అన్నారు.