చంద్ర‌యాన్-2 ఎందుకు ఆగిందో చెప్పేశారు!

Update: 2019-07-15 05:19 GMT
కోట్లాది మంది భార‌తీయుల‌తో పాటు.. ప్ర‌పంచ దేశాల‌న్ని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చంద్ర‌యాన్-2 ప్ర‌యోగాన్ని చివ‌రిక్ష‌ణంలో వాయిదా వేయ‌టం తెలిసిందే. అంతా సిద్ధ‌మై.. సెంటిమెంట్ లో భాగంగా పూజ‌లు చేసిన త‌ర్వాత‌..దేశ ప్ర‌థ‌మ పౌరుడు ఈ ప్ర‌యోగాన్ని ప్ర‌త్య‌క్షంగా తిల‌కించేందుకు వ‌చ్చినప్ప‌టికి.. కౌంట్ డౌన్ లోని చివ‌రి 56 నిమిషాల 24 సెక‌న్ల వ‌ద్ద వాయిదా వేయ‌టం తెలిసిందే.

ఎన్నో ప‌రీక్ష‌లు.. మ‌రెన్నో క్రాస్ చెకింగులు జ‌రిగిన త‌ర్వాత ప్ర‌యోగాన్ని ఎందుకు నిలిపివేశార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. దీనికి కార‌ణం ఏమిట‌న్న విష‌యాన్ని ఇస్రో ఇంత‌వ‌ర‌కూ వెల్ల‌డించ‌లేదు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా ప్ర‌ముఖ ఖ‌గోళ శాస్త్ర‌వేత్త బి.జి. సిద్ధార్థ చంద్ర‌యాన్-2 ప్ర‌యోగం ఎందుకు ఆగింద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు చెందిన ప్ర‌తినిధితో మాట్లాడిన ఆయ‌న‌.. చంద్ర‌యాన్-2 ప్ర‌యోగం ఆగ‌టానికి కార‌ణం క్ర‌యోజ‌నిక్ రాకెట్ ఇంజిన్ లోని స్వ‌ల్ప లీక్ ను గుర్తించార‌న్నారు. అయితే.. ఈ లీక్ ఎందుకు వ‌చ్చింద‌న్న‌ది ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ప్ర‌యోగాన్ని మ‌రికొన్ని వారాల పాటు నిలిపివేసే అవ‌కాశం ఉంద‌న్నారు.

భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగాల‌ను విజ‌య‌వంతం చేస్తున్న పీఎస్ ఎల్ వీ నౌక‌కు సంబంధించి ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌యాన్-2 ప్ర‌యోగంలో పెలోడ్ అధికంగా ఉంటుంద‌ని.. ఈ నేప‌థ్యంలో పీఎస్ ఎల్ వీ పనికి రాద‌న్న వ్యాఖ్య‌ను చేశారు. వాస్త‌వానికి ప్ర‌యోగం త‌ర్వాత క‌నుక స‌మ‌స్య‌ను గుర్తిస్తే చాలా ఇబ్బందులు వ‌చ్చేవ‌ని.. కౌంట్ డౌన్ స‌మ‌యంలోనే దాన్ని గుర్తించ‌టం మంచి జరిగింద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అన్ని సాంకేతిక స‌మ‌స్య‌లు పూర్తి అయ్యాక మాత్ర‌మే ప్ర‌యోగాన్ని నిర్వ‌హించాల్సి ఉంటుంద‌న్న ఆయ‌న‌.. చంద్ర‌యాన్ -2 ప్ర‌యోగానికి మ‌రికొన్ని వారాల పాటు ఆగాల్సి ఉంటుంద‌న్నారు.
Tags:    

Similar News