సంచలనంగా పంజాబ్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం.. అదెలానంటే?

Update: 2022-03-11 04:41 GMT
పాత నీరు పోవాలి. కొత్త నీరు రావాలి. అప్పుడే మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని రీతిలో అదిరే విజయాన్ని సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 స్థానాల్లో విజయం సాధించటం తెలిసిందే. ఎన్నికల సమయంలోనే తమ పార్టీ విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని ఆన్ లైన్ పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

పంజాబ్ లో సాధించిన ఘన విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిగా భతవంత్ మాన్ బాద్యతలు చేపట్టనున్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారోత్సవాన్ని ఏ రీతిలో చేస్తానన్న దానిపై ఆయన ఎవరూ ఊహించని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనని తేల్చి చెప్పారు. మరి.. ఎక్కడ చేస్తారన్న దానికి ఆయనమాటలు చూస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహరచన ఎలా ఉంటుందన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా ఉంటుంది.

స్వాతంత్య్ర పోరాటంలో తన ప్రాణాల్ని దేశం కోసం ఇచ్చేసిన భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలన్ లో తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని పేర్కొన్నారు. దేశానికి భగత్ సింగ్ చేసిన సేవల్ని గుర్తిస్తూ.. ఆయన పుట్టిన ఊళ్లో తాను ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

మిగిలిన పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోలు ఉంటాయని.. కానీ తన పాలనలో అలా ఉండదని స్పష్టం చేశారు.

తమ పాలనలో ఇకపై రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో షహీద్ భగత్ సింగ్.. అంబేడ్కర్ ఫోటోలు మాత్రమే ఉంటాయని తేల్చారు. ఎవరూ ఊహించనిరీతిలో చేస్తున్న ఆయన ప్రకటనలు ఇప్పుడు కొత్తగా ఉండటమే కాదు.. పంజాబ్ ప్రజలతో పాటు.. మిగిలిన రాష్ట్రాల వారు సైతం ఆమ్ ఆద్మీ పార్టీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News