ప్ర‌ణ‌బ్‌ కు భార‌త ర‌త్న‌!..బ్లాక్ డే అంటున్న పాల్!

Update: 2019-01-26 16:21 GMT
భారత మాజీ రాష్ట్రప‌తి - కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ మోస్ట్ నేత ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి దేశ అత్యున్న‌త పుర‌స్కారం భార‌త ర‌త్న ప్ర‌క‌టించిన మోదీ స‌ర్కారుపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్యక్త‌మ‌వుతోంది. బీజేపీ పాల‌న‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతకు భార‌త ర‌త్న ఇవ్వ‌డం అంటే గొప్ప విష‌య‌మేన‌ని - దేశానికి ప్ర‌ణ‌బ్ చేసిన సేవ‌ల‌కు గుర్తింపు గానే మోదీ స‌ర్కారు ఈ మేర‌కు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌ని మెజారిటీ వ‌ర్గం భావిస్తోంది. అయితే ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు - ప్ర‌ముఖ క్రైస్త‌వ మ‌త గురువు కేఏ పాల్ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు భార‌త ర‌త్న పుర‌స్కారానికి ప్ర‌ణ‌బ్ అన‌ర్హుడంటూ పాల్ పెను సంచ‌ల‌న‌మే రేపారు. ప్ర‌ణ‌బ్ పై క్రిమిన‌ల్ కేసులు న‌మోద‌య్యాయని, ఈ విష‌యం తెలిసి కూడా ప్ర‌ణ‌బ్ కు దేశ అత్యున్న‌త పుర‌స్కారం ఎలా ఇస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

శ‌నివారం విజ‌య‌వాడ‌లో ఓ న్యూస్ ఛానెల్‌ తో మాట్లాడిన సంద‌ర్భంగా ప్ర‌ణ‌బ్‌ పై ఆయ‌న సంచ‌ల‌న కామెంట్లు చేశారు. అమెరికా పోలీసుల‌కు ప్ర‌ణ‌బ్‌ పై త‌న ఆధ్వర్యంలోనే ఫిర్యాదు చేశామ‌ని, ఈ ఫిర్యాదు ఆధారంగా ప్ర‌ణ‌బ్‌ కు అమెరికా పోలీసుల నుంచి స‌మ‌న్లు కూడా జారీ అయ్యాయ‌ని పాల్ ఆరోపించారు. ఇలాంటి నేర చ‌రిత్ర ఉన్న ప్ర‌ణ‌బ్ కు భార‌త ర‌త్న ఎలా ఇస్తార‌ని పాల్ ప్ర‌శ్నించారు. నేర చ‌రిత్ర ఉన్న ప్ర‌ణ‌బ్‌కు భార‌త రత్న ఇవ్వ‌డాన్ని నిరసించిన పాల్‌... దీనిని ఓ బ్లాక్ డేగా ప‌రిగ‌ణించాల‌ని పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. అయినా నేర చరిత్ర ఉన్న ప్ర‌ణ‌బ్‌ కు భార‌త ర‌త్న అవార్డు ఇచ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కూడా పాల్ డిమాండ్ చేశారు. లోక్ స‌భ‌లో త‌నకు మెజారిటీ ఉంది... ఏం చేసినా చెల్లుతుంద‌ని మోదీ భావిస్తున్నార‌ని, ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని కూడా పాల్ ఆక్షేపించారు.

ఎవ‌రి ఇష్టానికి వారు దేశ అత్యున్న‌త పుర‌స్కారాలు ఇచ్చుకుంటూ పోతే.. ఇక ఆ అవార్డుల‌కు ఏం విలువ ఉంటుంద‌ని కూడా పాల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ దివంగ‌త నేత‌, లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ బాల‌యోగికి ఎందుకు భార‌త ర‌త్న ఇవ్వ‌లేద‌ని కూడా పాల్ మ‌రో కొత్త వివాదానికి తెర లేపారు. భార‌త ర‌త్న అవార్డును అందుకునేందుకు బాల‌యోగికి అర్హ‌త ఉంద‌ని, అయితే కేవ‌లం ఆయ‌న ద‌ళితుడు అన్న ఒకే ఒక్క కార‌ణంతో అవార్డుకు ఆయ‌న‌ను ఎంపిక చేయ‌లేద‌ని పాల్ ఆరోపించారు. ఈ విష‌యంలో టీడీపీ కూడా ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని కూడా పాల్ ప్ర‌శ్నించారు. మొత్తంగా ప్ర‌ణ‌బ్ కు భార‌త ర‌త్న అవార్డు ప్ర‌క‌ట‌న‌ను వివాదం చేసేసిన పాల్‌... బాల‌యోగి అంశాన్ని కూడా తెర మీద‌కు తీసుకుని వ‌చ్చి పెను సంచ‌ల‌న‌మే రేపార‌ని చెప్పాలి.
Tags:    

Similar News