కేసీఆర్ కు చిరాకు పుట్టే నినాదాన్ని తీసుకున్న భట్టి

Update: 2020-07-12 05:50 GMT
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని చూసిన ప్రతిసారీ కలుగక మానదు. మాటలతో ప్రత్యర్థుల్ని ఢీ కొట్టే నేర్పు.. ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ గులాబీ దళానికి ధీటుగా ఎదిగే విషయంలో కాంగ్రెస్ నేతలు కిందామీదా పడుతున్నారని చెప్పాలి. ఇప్పటికి తెలంగాణ కాంగ్రెస్ కు ముఖంగా కనిపించే నేత ఒక్కరు కనిపించరు. ఒకవేళ ఎవరైనా ఎదుగుతుంటే.. అంతర్గత కుమ్ములాటల్లో భాగంగా వారిని లాగేసే విలక్షణత ఆ పార్టీ నేతల సొంతం. ఈ కారణంతోనే  కలలో మాత్రమే కనిపించే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసి కూడా అధికారంలోకి రాలేని దీనస్థితి ఆ పార్టీదేనని చెప్పాలి.

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మంచి మాటకారితనంతో పాటు.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే లక్షణం ఉన్న సీనియర్ నేతల్లో భట్టి విక్రమార్క ఒకరు. సరిగా అవకాశం లభించాలే కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం ఇరుకున పడేసే సత్తా ఉన్న నేతగా భట్టిని చెప్పాలి. పలు సందర్భాల్లో అసెంబ్లీలో ఆయన ప్రస్తావించిన అంశాలతో తెలంగాణ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన పరిస్థితి. అయితే.. భట్టికి అవసరమైనంత మద్దతు ఇవ్వటంలో కాంగ్రెస్ కు చెందిన మిగిలిన నేతలు వెనుకబడిపోవటంతో.. ఆయన పెద్దగా ఎలివేట్ కాలేదని చెప్పాలి. ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడే విషయంలో భారీ కసరత్తు చేయటమే కాదు.. తన లాజిక్కుతో అందరిని కన్వీన్స్ చేసే సత్తా భట్టి సొంతమని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పు పట్టే క్రమంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వైరస్ తీవ్రత పెరిగిపోతూ.. పాజిటివ్ కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళలోనూ.. మిగిలిన రాష్ట్రాల మాదిరి పరీక్షలు జరిపించే విషయంలో తెలంగాణ రాష్ట్రం ఎందుకు వెనుకబడిందన్న విషయానికి సూటిగా సమాధానం ఇచ్చే వారే లేని పరిస్థితి. అసలు ఎందుకు పరీక్షలు చేయరన్నది కూడా ప్రశ్న. ఈ అంశంపై కేసీఆర్ సర్కారు తీరును పలువురు తప్పు పడుతున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదట్లో తెలంగాణ వ్యాప్తంగా ఒక్కరోజులో సమగ్రసర్వే చేయగలిగినప్పుడు.. కరోనా పరీక్షల్ని తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు పొరుగున ఉన్న ఏపీలో కరోనా పాజిటివ్ రేటు 2.8 ఉంటే తలెంగాణలో మాత్రం ఇది కాస్తా 22 శాతం ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెల్లటం కాదు.. ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యం వచ్చేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటున్నారు. గతంలో అవసరం లేకున్నా రోజులో సమగ్ర సర్వే చేయించిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం అవసరం ఉన్నా.. ప్రజలు కోరుకుంటున్నా కరోనా పరీక్షలు ఎందుకు చేయటం లేదు? అని ప్రశ్నించారు. నిజమే.. భట్టి చెప్పినట్లుగా.. రోజులో తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించటంలో సక్సెస్ అయిన కేసీఆర్.. కరోనా టెస్టుల విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? విపక్షాలు.. ప్రజల చేత ఎందుకిన్నిసార్లు అడిగించుకుంటున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ దేనని చెప్పక తప్పదు. 
Tags:    

Similar News