ఇద్ద‌రు అమ్మాయిలు.. రెండు కేసులు!

Update: 2016-01-18 12:55 GMT
రెండు రోజుల వ్య‌వ‌ధిలో ఇద్ద‌రి అమ్మాయిలకు సంబంధించి వార్త‌లు మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ఇద్ద‌రి వివ‌రాలు అంత‌కుముందు ఒక్క‌సారిగా మీడియాలోకి ఎక్క‌లేదు. ఇంకో చిత్ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ఇద్ద‌రు అమ్మాయిల‌కు సంబంధించిన ఉదంతాలు ఇద్ద‌రు ప్ర‌ముఖులతో ఉండ‌టం మ‌రో విశేషం. ఇక‌.. ఈ ఇద్ద‌రు అమ్మాయిల్లో ఒకమ్మాయి కార‌ణంగా ఒక ప్ర‌ముఖుడు మీద కేసు బుక్ అయితే.. మ‌రో అమ్మాయి మాత్రం పోలీసుల‌కు తానే బుక్ అయ్యింది. ఇంత‌కీ ఆ ఇద్ద‌రు అమ్మాయిల వ్య‌వ‌హారంలోకి వెళితే..

ఢిల్లీలో వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు వీలుగా స‌రి- బేసి విధానం అమ‌ల్లోకి తీసుకొచ్చిన ఢిల్లీ స‌ర్కారు విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌టం తెలిసిందే. దీన్ని పుర‌స్క‌రించుకొని ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు డిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌. ఈ స‌మావేశానికి వ‌చ్చిన భావ‌న ఆరోరా అనే అమ్మాయి ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ మీద ఇంకు వేసి.. సీడీని.. కొన్ని ప‌త్రాల్ని ఆయ‌న మీద విసిరి కొట్టారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌టం.. వ‌ద్దంటూ కేజ్రీ వారించ‌టం జ‌రిగిపోయాయి.

అయితే.. ఆమెపై కేసు న‌మోదు చేసి.. ఆమెను అరెస్ట్ చేశారు. ఇంత‌కీ ఈ భావ‌నా ఆరోరా ఎవ‌రన్న విష‌యాన్ని ఆరా తీస్తే.. ఆమె కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీని తీవ్రంగా వ్య‌తిరేకించే సంస్థ‌కు చెందిన కార్య‌క‌ర్త‌. ఇంత‌కీ.. కేజ్రీవాల్ మీద ఎందుకు దాడికి పాల్ప‌డిందంటే.. ఢిల్లీలో చేప‌ట్టిన స‌రి.. బేసి వ్య‌వ‌హారం వెనుక సీఎన్జీ కుంభ‌కోసం ఉంద‌ని.. దానిపై తాను స్టింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించాన‌ని.. ఆ ఆధారాలే తానిచ్చిన సీడీ.. ప‌త్రాలుగా చెబుతున్నారు.

ఇక‌.. వార్త‌ల్లోకి వ‌చ్చిన రెండో అమ్మాయి విష‌యంలోకి వెళితే.. భ‌జ‌రంగీ భాయిజాన్ ఫేం సిద్ధిఖీ. భాయిజాన్ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌ను పోషించిన అత‌గాడు.. ముంబ‌యిలో తాను ఉండే హౌసింగ్ సొసైటీలో టూవీల‌ర్ పార్కింగ్ లో త‌న కారును ఉంచ‌టం.. దీనిపై ఒక మ‌హిళ‌తో స‌ద‌రు న‌టుడు వాద‌న‌కు దిగ‌టం.. మాటా మాటా పెరిగి చివ‌ర‌కు స‌ద‌రు మ‌హిళ‌పై సిద్ధిఖీ దాడికి పాల్ప‌డ‌టం జ‌రిగింది.

దీంతో.. ఆమె ముంబ‌యి పోలీసుల‌కు పిర్యాదు చేసింది. మ‌హిళ‌పై దాడి చేసిన ఉదంతంలో సిద్ధిఖీ పై ముంబ‌యి పోలీసులు కేసు న‌మోదు చేశారు. పార్కింగ్ ఇష్యూలో అన‌వ‌స‌ర‌మైన ఆవేశానికి గురైన సిద్ధిఖీ అడ్డంగా బుక్ అయ్యార‌న్న మాట వినిపిస్తోంది. ఒక రోజు అటూఇటూగా ఇద్ద‌రు అమ్మాయిల వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్పొచ్చు.

Tags:    

Similar News