తను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనిషినని ఏపీ యువ మంత్రి - ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి తన సోదరుడు - టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఓటమిపాలైతే తాను ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి భూమా అఖిలప్రియ మరోమారు పేర్కొన్నారు. నంద్యాల నుంచి అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న భూమా బ్రహ్మానందరెడ్డి ప్రజా ఆశీర్వాదయాత్ర ప్రారంభానికి వెళ్లే ముందు అఖిలప్రియ తన తల్లిదండ్రులు - పెద్దనాన్న (బ్రహ్మానందరెడ్డి తండ్రి) సమాధుల వద్ద నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె భూమా ఘాట్ వద్ద మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమిపాలైతే రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి ఉంటామని అఖిలప్రియ స్పష్టం చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వడానికి కూడా సిద్ధమేనన్నారు. అయితే తనపై సవాల్ విసురుతున్న శిల్పా మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో తన తండ్రి భూమా నాగిరెడ్డిపై పోటీ చేసిన సమయంలో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పి భూమాపై ఓడిపోయిన తర్వాత మాట తప్పారని గుర్తు చేశారు. మాట నిలుపుకోలేని శిల్పా తనపై సవాల్ విసరడం విడ్డూరంగా ఉందని అన్నారు. శిల్పా గతంలో చేసిన సవాల్‌కు సమాధానం ఇస్తే దానిపై తాను స్పందిస్తానన్నారు. తల్లిదండ్రులు, పెద్దనాన్న ఆశీస్సులు తనకు ఉన్నాయని, రాబోయే ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయమన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/