బోయిన్ పల్లిలో కేసు.. కర్నూలులో భూమా అఖిలప్రియ ప్రెస్ మీట్

Update: 2021-07-09 04:05 GMT
తమకు ఏ మాత్రం అలవాటు లేని కేసుల్ని ఎదుర్కొంటోంది భూమా ఫ్యామిలీ. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన భూమా కుటుంబం మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా.. వాటిల్లో చాలా కొన్ని మాత్రమే పోలీస్ స్టేషన్ కు వెళ్లేవి. ఆ మాటకు వస్తే.. భూమా నాగిరెడ్డి-శోభానాగిరెడ్డి కుటుంబం మీద కేసులు పెట్టేంత ధైర్యం చాలా తక్కువమందే చేసేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు భూమా అఖిలప్రియ మీదా.. ఆమె కుటుంబ సభ్యుల మీద నమోదవుతున్న కేసులు ఆసక్తికరంగానే కాదు.. సంచలనంగా మారుతున్నాయి.

హైదరాబాద్ లోని తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గరి బంధువుల్ని భూమా అఖిలప్రియ.. ఆమె భర్తతో పాటు మరికొందరు కిడ్నాప్ చేశారంటూ నమోదైన కేసు రెండుతెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారటం తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలు రెండు రాష్ట్రాల్లోని రాజకీయాలు సైతం కాస్త వేడెక్కేలా చేశాయి. అయితే.. ఈ మ్యాటర్ పూర్తిగా ఆస్తులకు సంబంధించిన వివాదం కావటం.. అందులో మాజీ మంత్రి భూమా అఖిల పేరు ప్రముఖంగా వినిపించటంతో.. ఈ వ్యవహారంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి బోయిన్ పల్లి స్టేషన్ కు రావాల్సిన అఖిలప్రియ భర్త.. తమ్ముడు హాజరు కాకపోవటమే కాదు.. తప్పుడు పత్రాలతో మోసం చేశారంటూ తాజాగా కేసు నమోదైంది.

కరోనా రాకున్నా.. వచ్చినట్లుగా తప్పుడు ధ్రువపత్రాల్ని పోలీసులకు ఇచ్చి.. విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టినట్లుగా వారిపై కేసు నమోదు కావటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఉదంతంపై ప్రెస్ మీట్ పెట్టారు భూమా అఖిలప్రియ. తన భర్త మీదా.. తన తమ్ముడు జగన్ విఖ్యాత్ రెడ్డిపైన తప్పుడు కేసు పెట్టినట్లుగా అఖిలప్రియ పేర్కొన్నారు.

పోలీసుల్ని అడ్డు పెట్టుకొని తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పలు వివరాల్ని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం తన భర్త.. తమ్ముడు తెలంగాణ రాష్ట్రం వెళ్లి వచ్చి.. కరోనా పరీక్ష చేయించుకున్నారని.. అది జరిగిన కొన్ని గంటలకే పోలీసులు వచ్చి స్టేషన్ కు రావాలని చెప్పారన్నారు. ‘ల్యాబ్ నిర్వాహకులు నా భర్తకు పాజిటివ్ అని రిపోర్టు ఇచ్చారు. పోలీసులకు మాత్రం నెగిటివ్ అని రిపోర్టు ఇచ్చారు. ల్యాబ్ వారి మీద కేసు వేస్తాం. కిడ్నాప్ ఘటనలో నా భర్త ఉంటే మళ్లీ ఐడెంటిఫికేషన్ కోసం ఎందుకు రమ్మంటున్నారు’’ అని ప్రశ్నించారు.

పోలీసులు తమను హింసిస్తున్నారని.. ఈ అంశంపై తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లకు తాను లేఖ రాయనున్నట్లుగా భూమా అఖిలప్రియ వెల్లడించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ప్రెస్ మీట్ చివర్లో ఆమె ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తమ ప్రాణం పోయిన తమ ఆస్తుల్ని మాత్రం వదులుకోబోమని.. తమపై పెట్టిన కేసుల్ని సీబీఐకి అప్పగించాలన్నారు. హఫీజ్ పేట్ వద్ద ఉన్న వందల కోట్ల రూపాయిల విలువైన భూములకు సంబంధించిన వివాదమే.. ఈ మొత్తం వ్యవహారాలకు కారణమన్న మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News