నంద్యాల‌లో టీడీపీదే విజ‌యం!

Update: 2017-08-28 09:34 GMT
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అధికార టీడీపీ విజ‌యం సాధించింది. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నిక‌ల‌ను ఇటు అధికార టీడీపీతో పాటు అటు విప‌క్ష వైసీపీ కూడా ప్ర‌తిష్ఠాత్మ‌కంగానే భావించాయి. ఈ క్ర‌మంలో ఇరు పార్టీలు కూడా స‌ర్వ శ‌క్తులూ ఒడ్డి పోరాడాయి. టీడీపీ అధినేత‌గా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నోటిఫికేష‌న్‌ కు ముందే రెండు ప‌ర్యాయాలు అక్క‌డ కీల‌క ప‌ర్య‌ట‌న‌లు నిర్వ‌హించారు. ఎన్నిక‌ల‌కు ముందుగా వంద‌ల కోట్ల విలువ చేసే అభివృద్ధి ప‌నుల‌కు అక్క‌డిక‌క్క‌డే మంజూరు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంద‌న‌గా నంద్యాల వెళ్లిన చంద్ర‌బాబు... రెండు రోజుల పాటు ప్ర‌చారం నిర్వ‌హించారు.

అదే స‌మ‌యంలో గెలుపు ధీమాతోనే అక్క‌డ అడుగు పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... త‌న తొలి బ‌హిరంగ స‌భ‌తోనే హీట్ పెంచేశారు. మొత్తం 14 రోజులుగా ఆయ‌న అక్క‌డ నాన్ స్టాప్ ప్ర‌చారం సాగించారు. ఇక ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత ఈ నెల 23న పోలింగ్ జ‌రిగింది. ఇరు పార్టీలూ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ ఎన్నిక‌ను ప‌రిగ‌ణించిన నేప‌థ్యంలో ఉద్రిక్త‌త‌లు త‌ప్ప‌వ‌న్న భావ‌న ఉన్నా... పోలింగ్ ప్ర‌శాంతంగానే ముగిసింది. ఇక నేటి ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా... ప్ర‌తి రౌండ్ లోనే ఆధిక్యం క‌న‌బ‌ర‌చిన టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు. మొత్తం 19 రౌండ్ల పాటు కౌంటింగ్ జ‌ర‌గ‌గా... 16వ రౌండ్ మిన‌హా ప్ర‌తి రౌండ్ లోనూ ఆధిక్యం సాధించిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి అంతిమంగా 27వేల 456 ఓట్ల ఆధిక్యంతో విజ‌యం సాధించారు.

16వ రౌండ్ పూర్తి కాగానే 50 శాతం ఓట్ల‌ను సాధించేసిన బ్ర‌హ్మానంద‌రెడ్డి ఇంకా మూడు రౌండ్లు మిగిలి ఉండ‌గానే విజ‌యం సాధించారు. ఇక ఆయా పార్టీల అభ్య‌ర్థుల‌కు వ‌చ్చిన ఓట్ల‌ను ప‌రిశీలిస్తే... టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి మొత్తంగా 97వేల 106 ఓట్లు పోల‌వ‌గా, వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డికి 69వేల 640 ఓట్లు పోల‌య్యాయి. ఇక విజ‌యాన్ని ఏమాత్రం ఆశించ‌ని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో 1,153 ఓట్ల‌ను సాధించింది. వెర‌సి టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి - వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డిపై 27వేల 456 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించిన‌ట్లైంది.
Tags:    

Similar News