శిల్పా.. భూమాలు ఎంతలా కలిశారో తేలిపోనుంది

Update: 2016-05-07 15:20 GMT
కర్నూలు రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా.. టీడీపీ నేతలు శిల్పా బ్రదర్స్.. భూమా కుటుంబాలకు మధ్యనున్న రచ్చ ఎంతన్నది సుపరిచితం. నిజానికి వీరి వ్యవహారం కాస్త చిత్రంగా ఉంటుంది. 2004 సమయంలో భూమా టీడీపీలో ఉంటే.. శిల్పా బ్రదర్స్ కాంగ్రెస్ లో ఉండేవారు. వైఎస్ కారణంగా శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగా వ్యవహరించారు కూడా. ఇలా.. ఈ రెండు కుటుంబాలు తూర్పు.. పడమర అన్నట్లు ఉండేవి. వీరి మధ్య రాజకీయ విభేదాలు కూడా భారీగానే ఉండేవి.

కాలక్రమంలో భూమా టీడీపీని వదిలిపెట్టి ప్రజారాజ్యంలోకి వెళ్లి.. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తాజాగా టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. శిల్పా బద్రర్స్ మాత్రం కాంగ్రెస్ నుంచి విభజన నేపథ్యంలో గమ్ముగా టీడీపీలోకి వచ్చేశారు. ఉప్పునిప్పులా ఉండే ఈ రెండు ఫ్యామిలీలు వేర్వేరు పార్టీల మధ్య ఉన్నప్పుడు రచ్చ మామూలే. అయితే.. భూమా రాకతో శిల్పా సోదరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. జగన్ లక్ష్యంగా ఉన్న చంద్రబాబు వారికి నచ్చచెప్పి భూమాకు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేశారు.

అధినేత నిర్ణయానికి ఓకే అన్నా వీరి మధ్య విభేదాలు తగ్గకపోగా.. ఒకే పార్టీలోనూ వారి మధ్య రచ్చ ఓ రేంజ్లో సాగింది. ఇది పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుండటంతో చంద్రబాబు కలుగజేసుకోక తప్పలేదు. ఈ మధ్యనే.. భూమా.. శిల్పా బద్రర్స్ ను ఒకచోటకు చేర్చి పంచాయితీ పెట్టిన బాబు.. వారిద్దరూ కలిసిపోవాలని.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని తేల్చి చెప్పటంతో.. అధినేత మాటకు వెనక్కి తగ్గిన వారు తాము కలిసిపోతున్నట్లుగా ప్రకటించారు. ఇంతకాలంగా సాగిన విభేదాలు.. బాబు అలా పంచాయితీ పెట్టగానే తేలిపోతుందా? అన్న సందేహాలు చాలామందికే ఉన్నాయి.

అయితే.. ఈ సందేహాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం తాజాగా వచ్చింది. బుధవారం భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె రిసెప్షన్ బెంగళూరులో ఉంది. ఆ కార్యక్రమానికి రావాలంటూ శిల్పా బ్రదర్స్ ను భూమా ఆహ్వానించారు. తన ఇంట్లో వేడకకు శిల్పా బద్రర్స్ ను పిలవటం ద్వారా తన తప్పు లేకుండా భూమా చేసుకుంటే.. మరి.. ఆ వేడుకకు శిల్పా బ్రదర్స్ వెళతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మరో నాలుగైదు రోజులు ఆగితే.. ఆ ముచ్చట తేలిపోనుందని చెప్పాలి.
Tags:    

Similar News