ఎవరు ఉద్యమించినా ఆయన మద్దతిస్తారట..

Update: 2016-12-23 10:54 GMT
భూమన కరుణాకరరెడ్డి... ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం ప్రారంభంలో జరిగిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనం కేసులో వేళ్లన్నీ ఆయనవైపే చూపించాయి. ఇప్పుడాయన ముద్రగడ పద్మానాభాన్ని కలిసి ఆయన ఉద్యమానికి మద్దతు పలికారు. అంతేకాదు... చంద్రబాబు కారణంగా మోసపోయిన ఎవరు ఉద్యమించినా వారికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. చంద్రబాబు హమీలతో మోసపోయిన అన్ని వర్గాలూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఆయన అన్నారు.
    
ఎన్నికల సమయంలో 600కు పైగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాటలు నమ్మి రైతులు - డ్వాక్రా మహిళలు - బలహీన వర్గాలు - దళితులు - మహిళలు మోసపోయారని.. వారెవరవైనా ఉద్యమిస్తే  వెన్నుదన్నుగా నిలబడతానని చెప్పారు. అందుకు ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధమన్నారు.
    
ముద్రగడ పద్మనాభాన్ని మనస్ఫూర్తిగా అభినందించడానికే తాను వచ్చానని, ఆయన నిబద్ధత కలిగిన వ్యక్తి అని అన్నారు. కాపులకు జరిగిన అన్యాయాన్ని చూసి భరించలేక.. ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.  ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 19న పద్మనాభం నిర్వహించిన సభకు నైతిక మద్దతు ఇవ్వడానికి నేను ఆయన్ను కలిస్తే తనను ద్రోహిగా - సంఘవిద్రోహిగా - అరాచక శక్తిగా చంద్రబాబు సృష్టించడానికి విశ్వప్రయత్నం చేశారన్నారు. ముద్రగడ లక్ష్యం పట్ల నమ్మకం కలిగిన వ్యక్తిగా అప్పుడు, ఇప్పుడు తాను చెప్పేది ఒకటేనని, కాపులు చేస్తున్న ఈ పోరాటానికి తమ పరిపూర్ణ మద్దతు కొనసాగుతుందని అన్నారు. తాను చంద్రబాబులా హింసాయుత రాజకీయాలను ప్రోత్సహించనన్నారు. చంద్రబాబు చేసిన కిరాతక చర్యలకు లెక్కేలేదని, అందుకు పరాకాష్ట.. రంగా హత్యలో కూడా చంద్రబాబు పాత్ర ఉందని లోకం కోడై కూస్తోందని చెప్పారు. మామ ఎన్టీ రామారావు మీదే చెప్పులు విసిరిన ఘనత ఆయనదేనని భూమన విమర్శించారు. పరిటాల - వైఎస్‌ ఆర్‌ కుటుంబానికి ఎలాంటి రాజకీయ గొడవలు లేవని భూమన అన్నారు. పరిటాలపై జూబ్లీహిల్స్‌ లో కారుబాంబు దాడి జరిగినప్పుడు వైఎస్ తో పాటు ఆయన తండ్రి రాజారెడ్డి కూడా పరామర్శించారని భూమన గుర్తుచేశారు. రాజారెడ్డి చనిపోయినప్పుడు పరిటాల రవి నివాళులర్పించారన్నారు. ఎన్‌ టీఆర్‌ హయాంలో పరిటాల రవిని అణగదొక్కాలని బాబు కుట్రపన్నారని భూమన ఆరోపించారు. ఆధారాలు లేకుండా భయపెట్టాలని చూస్తే తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News