దేశం మొత్తమ్మీద నలుగురిలో అచ్చెన్న, దేవినేని

Update: 2016-08-06 10:29 GMT
దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులకు సంబంధించిన ఆస్తులు - నేరాల చిట్టా విప్పిన  అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తన నివేదికలో వెల్లడించిన వాస్తవాలు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ లిస్టులో ఏపీ నేతలు టాప్ లో ఉండడంతో పాలక టీడీపీ ఇరుకునపడింది.  దేశంలోనే అత్యంత ధనికుడైనా మంత్రిగా నారాయణ నిలిచిన సంగతి తెలిసిందే... అయితే.. ఏపీ మంత్రుల్లో ఆయన ఆస్తుల పరంగా దేశం దృష్టిని ఆకర్షిస్తే మరో ఇద్దరు మంత్రులు మహిళలపై నేరాలతో ‘దేశం’ పరువు తీశారు.  అన్ని రాష్ట్రాల మంత్రుల్లో  210 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా... అందులో నలుగురిపై మహిళలపై నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందట. దేశవ్యాప్తంగా అలాంటి కేసులున్న నలుగురిలో మన ఏపీ మంత్రులు ఏకంగా ఇద్దరున్నారని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఆరోపిస్తున్నారు. నారాయ‌ణ చంద్ర‌బాబుకు బినామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని భూమన ధ్వ‌జ‌మెత్తారు.  ఇక రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌రిగిన భూదందాపై సీబీఐతో విచార‌ణ చేయించాల‌ని త‌మ పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గ‌తంలోనే డిమాండ్ చేసిన విష‌యాన్ని సైతం ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు.

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారు దేశం మొత్తం మీద నలుగురు మంత్రులు ఉండగా ఆ జాబితాలో దేవినేని ఉమ - అచ్చెన్నాయుడు పేర్లు ఉన్నాయని కరుణాకర్‌ రెడ్డి వెల్లడించారు. దేశం మొత్తం మీద నలుగురు మంత్రులు స్త్రీలపై అఘాయిత్వాలకు పాల్పడితే వారిలో ఇద్దరు మన రాష్ట్రానికి చెందిన వారు కావడం, అది కూడా సీఎంకు సన్నిహితులైన దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు కావడం సిగ్గు చేటని విమర్శించారు. ఇలాంటి వారిని కేబినెట్‌ లో పెట్టుకున్నందుకు చంద్రబాబును ఏమని అనాలో కూడా తెలియడం లేదన్నారు.

కొద్ది రోజుల క్రితమే గుంటూరులో ఒక మంత్రి కుమారుడు అందరూ చూస్తుండగానే అమ్మాయిల హాస్టల్‌ లోకి చొరబడేందుకు ప్రయత్నించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ఏమనాలని భూమన ప్రశ్నించారు. ఇలాంటి మంత్రులను కేబినెట్‌ లో పెట్టుకుని మహిళల జీవితాల్లో వెలుగునింపుతామని చంద్రబాబు చెబితే నమ్మాలా అని ప్రశ్నించారు. క్విట్ ఇండియా ఉద్యమానికి మరికొద్ది రోజుల్లో 75ఏళ్లు పూర్తవుతాయని.. ఈ సమయంలోనే విజయవాడలోని గాంధీ విగ్రహాన్ని తీసుకెళ్లి బుడమేరులో వేయించిన చంద్రబాబును ఏమనాలన్నారు. ఎన్టీఆర్ చెప్పినట్టు చంద్రబాబును గాడ్సే బాబు అని పిలవాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేకహోదాపై జైట్లీ ప్రకటనతో రక్తం మరిగిందన్న చంద్రబాబు… ఆ మరిగిన రక్తాన్ని మురగబెట్టుకుని వెళ్లి అదే జైట్లీకి శాలువా కప్పి వచ్చారని భూమన కరుణాకర్‌ రెడ్డి ఎగతాళి చేశారు.
Tags:    

Similar News