చంద్ర‌బాబును న‌ల్ల కుబేరుడ‌న్న భూమ‌న‌!

Update: 2016-10-13 07:24 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుపై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌రరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నేటి ఉద‌యం తిరుప‌తిలో మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ భూమ‌న‌... చంద్ర‌బాబుపై విమర్శ‌నాస్త్రాలు సంధించారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం తూర్పుగోదావ‌రి జిల్లా తునిలో కాపు ఐక్యవేదిక నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నిర్వ‌హించిన కాపు గ‌ర్జ‌న‌లో జ‌రిగిన విధ్వంసానికి భూమ‌న ప‌థ‌క ర‌చ‌న చేశార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన సీఐడీ పోలీసులు ఇప్ప‌టికే రెండు సార్లు భూమ‌న‌ను గుంటూరుకు పిలిపించి మ‌రీ విచారించారు. తుని ఘ‌ట‌న‌లో భూమ‌న ప్ర‌మేయం ఉంద‌న్న టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌ల‌తో వైసీపీ నేత‌లు కూడా స్వరం పెంచారు. ఇక భూమ‌న ఏకంగా ఎదురుదాడికే దిగుతున్నారు.

ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం తిరుప‌తిలో మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న‌... చంద్ర‌బాబు అవినీతి భాగోతం అంటూ తీవ్ర స్థాయి ఆరోప‌ణ‌లు చేశారు. నిన్న వెల‌గ‌పూడిలోని తాత్కాలిక స‌చివాలయంలోని త‌న కార్యాల‌యాన్ని ప్రారంభించిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు... రూ.1,000 - రూ.500 నోట్ల‌ను నిషేధించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించారు. తద్వారా దేశంలో అవినీతికి అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌ని - భార‌త్ సూప‌ర్ ప‌వ‌ర్‌ గా అవ‌త‌రిస్తుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇవే అంశాల‌ను ఆధారంగా చేసుకుని భూమ‌న విరుచుకుప‌డ్డారు.

చంద్ర‌బాబును అతి పెద్ద న‌ల్ల‌కుబేరుడిగా అభివ‌ర్ణించిన భూమ‌న... చంద్ర‌బాబు వ‌ద్ద ల‌క్ష కోట్ల‌కు పైగా అక్ర‌మాస్తులున్నాయ‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు వ‌ద్ద ఉన్న నోట్ల క‌ట్ట‌ల‌ను కాలిస్తే... ఓ మెగా వాట్ విద్యుత్ ఉత్ప‌త్తి అవుతుంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. అధిక విలువ క‌లిగిన క‌రెన్సీ నోట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేయ‌డం... దెయ్యాలు వేదాల‌ను వ‌ల్లించిన‌ట్లుగానే ఉంద‌ని భూమన ధ్వ‌జ‌మెత్తారు. 12 ఏళ్ల క్రిత‌మే చంద్ర‌బాబును అవినీతి సామ్రాట్ గా తెహ‌ల్కా డాట్‌ కామ్ తేల్చేసిన వైనాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు.  అవినీతికి చంద్ర‌బాబు కేరాఫ్ అడ్రెస్ అని కూడా భూమ‌న వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికిప్పుడు చంద్ర‌బాబు - ఆయన అనుయాయుల ఇళ్ల‌పై ఐటీ శాఖ దాడులు చేస్తే... ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కు త‌క్కువ కాకుండా ప‌ట్టుబ‌డ‌తాయ‌ని చెప్పారు. వెర‌సి వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ల‌క్ష కోట్ల అక్ర‌మ సంపాద‌న‌ను వెన‌కేశార‌న్న ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టిన భూమ‌న‌... అదే ల‌క్ష కోట్లు చంద్ర‌బాబు వ‌ద్ద ఉన్నాయ‌ని ఆరోపించేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News