ముద్ర‌గ‌డ‌కు ద‌గ్గ‌ర‌వుతున్న వైసీపీ..వాట్ నెక్ట్స్‌?

Update: 2016-12-24 09:04 GMT
కాపుల్ని బీసీ జాబితాలో చేర్చాలంటూ ఉద్యమిస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభానికి ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైసీపీ చేరువ అవుతోంది. వైకాపా సీనియర్‌ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఈ మేర‌కు పార్టీ త‌ర‌ఫున సంఘీభావం ప్ర‌క‌టించారు. నేరుగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి వెళ్లి ముద్రగడను కలుసుకొని మ‌ద్ద‌తు తెలిపారు. ఈ పరిణామంపై స‌హ‌జంగానే అధికార తెలుగుదేశం పార్టీ ఒకింత క‌ల‌వ‌ర‌పాటుకు గురైంది. త‌మ‌ను రాజ‌కీయంగా వ్య‌తిరేకించే వ‌ర్గాలు ఒక్క‌చోటికి చేరుతున్నాయ‌ని ఆ పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

ముద్ర‌గ‌డ‌తో స‌మావేశం అయిన సంద‌ర్భంగా భూమ‌న మీడియాతో మాట్లాడుతూ ముద్ర‌గ‌డ‌ పోరాటం అత్యంత న్యాయబద్దమైందని, గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉండలేకే ముద్రగడ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారంటూ భూమన పేర్కొన్నారు. ముద్రగడ ఆదినుంచి ఒక నిబద్దత కలిగిన వ్యక్తిగా భూమన అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యమాలు - నిరసనలు - నిరాహారదీక్షలు - సమర్ధనీయమని ముద్ర‌గ‌డ ఎంచుకున్న మార్గం సహేతుకమైందేనన్నారు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు ఆరు వందలకు పైగా హామీలిచ్చారని అయితే ఇందులో ఏ ఒక్కటీ ఇంతవరకు అమలు చేయలేదని భూమ‌న త‌ప్పుప‌ట్టారు. రైతులు - డ్వాక్రా మహిళలు - దళితులు - బలహీనవర్గాలు - ఇలా అన్నివర్గాల్ని చంద్రబాబు మోసం చేశారని వీరంతా ప్రభుత్వంపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని భూమ‌న తెలిపారు. వారికి వైకాపా అండదండగా నిలుస్తుందన్నారు.

ఇదిలా ఉండ‌గా... ముద్రగడ పోరాటానికి ప్రజామద్దతుందని అందుకే తానుకూడా మద్దతు తెలిపేందుకే మరోసారి స్వయంగా వచ్చి ముద్రగడను కలిశానని భూమ‌న‌ స్పష్టం చేశారు. అయితే తనపై కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టుచేయాలని తెలుగుదేశం ప్రభుత్వం చూస్తోందని భూమన విమ‌ర్శించారు. జనవరిలో ముద్రగడ నిర్వహించిన సభకు హాజరై మద్దతు తెలిపినందుకు గాను తనను సంఘ విద్రోహశక్తిగా ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే తానెప్పుడూ చంద్రబాబులా హింసాయుత రాజకీయాలకు పాల్పడలేదన్నారు. రంగా హత్యలో బాబు పాత్ర అందరికీ తెలిసిందేనని, సొంతమామ ఎన్‌టిఆర్‌పై చెప్పులు విసిరించిన ఘనత కూడా బాబుకే దక్కుతుందన్నారు. పరిటాల రవీంద్రను అణగదొక్కి చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడ్డారని భూమ‌న దుయ్య‌బ‌ట్టారు. ఎప్పుడు హింసను, కిరాతకచర్యలకు ప్రోత్సహించ‌న‌ప్ప‌టికీ త‌న‌పై ఉద్దేశ‌పూర్వ‌కంగా రాష్ట్ర ప్ర‌భుత్వం క‌క్ష‌గ‌డుతోంద‌ని భూమ‌న మండిప‌డ్డారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News