భూమనా?... మాట‌లు 'కోట్లు' దాటుతున్నాయండీ!

Update: 2018-12-29 11:13 GMT
రాజ‌కీయ నాయ‌కులంటే... ఉన్న వాస్త‌వాన్ని కాస్తంత ఎక్కువ చేసి... జ‌బ్బ‌లు చ‌రుచుకోవ‌డం మామూలే గానీ... ఆ డాంబికాలు హ‌ద్దులు దాటితే మాత్రం వైరి వ‌ర్గాలు విరుచుకుప‌డ‌తాయ‌న్న ఇంగితం కూడా ఉన్న‌ప్పుడే రాజ‌కీయాల్లో రాణిస్తారు. సినీ జ‌నాల విష‌యానికి వ‌స్తే... త‌మ సినిమా ప్లాఫ్ అయినా కూడా దానిని దాచేసి... త‌మ సినిమాకు ఈ మేర లాభాలు వ‌చ్చాయ‌ని - ఇన్నేసి రికార్డులు సృష్టించింద‌ని - అస‌లు త‌మ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించేసుకుంటున్న వైనం కూడా మన‌కు కొత్తేమీ కాదు. థియేట‌ర్ల‌లో అట్ట‌ర్ ప్లాఫ్ గా నిలిచిన సినిమాను బంప‌ర్ హిట్ అంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించేసి... మ‌రింత మంది త‌మ సినిమాకు వ‌చ్చేలా చేసుకుంటున్న వైనం కూడా మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. ఈ త‌ర‌హా ప్ర‌చారంతో సినిమా జ‌నాల‌కు గానీ - ప్రేక్ష‌కుల‌కు గానీ పెద్ద‌గా న‌ష్ట‌మేమీ ఉండ‌దు. అయితే రాజ‌కీయాల్లో అలా కాదు క‌దా. ఎప్పుడెప్పుడు త‌మ వైరి వ‌ర్గాల త‌ప్పులు దొరుకుతాయా? అంటూ వేయి క‌ళ్ల‌తో ఆయా పార్టీలు చూస్తూ ఉంటాయి. ఇలా త‌ప్పు దొరికిందా? అలా ప‌ట్టేసి నానా యాగీ చేస్తారు. వెర‌సి ఆ డాంబికం ప‌లికిన నేత దెబ్బ‌యిపోవ‌డ‌మే కాకుండా... స‌ద‌రు నేత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత‌కు కూడా దెబ్బ ప‌డిపోతుంది. ఈ ప్రాథ‌మిక సూత్రాన్ని మ‌రిచిపోతున్న ఓ కీల‌క నేత ఉదంత‌మిది.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వెంట్రుక వాసిలో అధికారాన్ని చేజార్చుకున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... ఈ ద‌ఫా ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌న్న క‌సితో జనంతో మ‌మేకం అయిపోతున్నారు. జ‌నం స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ... నిరాశ‌లో ఉన్న జ‌నాల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాద‌యాత్రకు శ్రీ‌కారం చుట్టారు. నెల‌ల త‌ర‌బ‌డి సాగుతున్న ఈ యాత్ర‌లో ఇప్ప‌టికే ఆయ‌న 3,600 కిలో మీట‌ర్ల దూరాన్ని న‌డవ‌డంతో పాటుగా ఏపీలోని మొత్తం 13 జిల్లాల్లోని మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టేశారు. ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళం జిల్లాలో కొన‌సాగుతున్న జ‌గ‌న్‌... వ‌చ్చే నెల ఆ జిల్లాలోని ఇచ్ఛాపురంలో పాద‌యాత్ర‌ను ముగించ‌నున్నారు. జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ యాత్ర‌కు అంత‌కంత‌కూ ప్ర‌జాద‌ర‌ణ పెరిగిపోతోంది. పాద‌యాత్ర‌కు వ‌స్తున్న జ‌న‌సందోహాన్ని చూసిన అధికార టీడీపీ నేత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయంటే అతిశ‌యోక్తి కాదేమో. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర ముగియ‌గానే తిరుమ‌ల కొండ‌కు రానున్నార‌ని - కాలిబాట‌న తిరుప‌తి నుంచి తిరుమ‌ల చేరుకుంటార‌న్న విష‌యాన్ని ప్ర‌క‌టించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ - తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి... జ‌గ‌న్ ను ఇబ్బందుల్లోకి నెట్టేలా ఓ డాంబికాన్ని ప‌లికారు.

జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో 2 కోట్ల 70 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఈ మాట విన‌ప‌డంగానే... ఇంత డ‌బ్బా మాట‌లు అవ‌స‌ర‌మా? అన్న ప్ర‌శ్న తెర మీద‌కు వ‌చ్చింది. అస‌లు రాష్ట్ర జ‌నాభానే 4 కోట్ల మేర ఉంటే... అందులో స‌గానికి పైగా జ‌నాన్ని జ‌గ‌న్ క‌లిశారంటూ భూమ‌న చెప్ప‌డం నిజంగానే విడ్డూరం అనిపించ‌క మాన‌దు. అంతేకాకుండా 13 జిల్లాల్లో పాద‌యాత్ర చేప‌ట్టిన జ‌గ‌న్‌... రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేయ‌లేదు. వీయిల‌నంత మేర నియోజ‌క‌వ‌ర్గాల‌ను ట‌చ్ చేస్తూ సాగిన జ‌గ‌న్‌... పాద‌యాత్ర‌లో తాను ట‌చ్ చేయ‌ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను బ‌స్సు యాత్ర ద్వారా ట‌చ్ చేస్తార‌ని ఆ పార్టీ ప్ర‌క‌టించింది. ఈ లెక్క‌న జ‌గ‌న్ ఇప్ప‌టిదాకా ట‌చ్ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్కో నియోజక‌వ‌ర్గంలో 50 వేల మంది చొప్పున క‌లిసినా... ఆ లెక్క 70 ల‌క్ష‌ల‌కు మించదు. అయితే ఈ వాస్త‌వాన్ని మ‌రిచిన భూమ‌న‌... త‌మ నేత ఏకంగా 2.70 కోట్ల మందిని క‌లిశార‌ని చెప్ప‌డం విడ్డూరం కాక మ‌రేమిట‌న్న ప్ర‌శ్న ఉద‌యించ‌క మాన‌దు. జ‌నం స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు జ‌గ‌న్ ప‌డుతున్న క‌ష్టం ఇలాంటి నేత‌ల డ‌బ్బా మాట‌ల ద్వారా నిష్ఫ‌ల‌మ‌య్యే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు. అంతేకాకుండా... ఎక్క‌డ జ‌గ‌న్ పార్టీ త‌ప్పులు దొరుకుతాయా? అంటూ కాసుక్కూర్చున్న టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌కు భూమ‌న నోట నుంచి వ‌చ్చిన మాట‌లు ఇట్టే ప‌ట్టించేసేలానే ఉన్నాయ‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో కీల‌క నేత‌లు కాస్తంత క్లారిటీతో, జాగ్ర‌త్త‌తో మాట్లాడితే బాగుంటుంద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?




Tags:    

Similar News