ఉక్రెయిన్ లో రష్యాది నరమేధమే.. : బైడెన్ ధ్వజం

Update: 2022-04-13 10:30 GMT
ఏడు వారాలుగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేస్తూ వచ్చింది అమెరికా. యుద్ధం ముదురుతున్న కొద్దీ ఇటీవల రష్యాతో సాధారణ వాణిజ్య సంబంధాలనూ తెంచుకుంది. దీనిప్రకారం రష్యాతో అమెరికా వాణిజ్య సంబంధాలు మయాన్మార్, ఉత్తర కొరియా స్థాయికి పడిపోయాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల పోలండ్ వెళ్లారు. అక్కడ నాటో దళాలతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణను ఇప్పటికే ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే నేరుగా యుద్ధంలోకి దిగడం లేదు. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది కాబట్టి సంయమనం పాటిస్తున్నారు.

యుద్ధ నేరాల నుంచి..

ఉక్రెయిన్‌పై రష్యా దళాల చర్యలను గతంలో బైడెన్‌ యుద్ధ నేరాలుగానే పేర్కన్నారు. కానీ, తాజాగా నరమేధం పదం వాడటం విశేషం. ఉక్రెయిన్‌ సంక్షోభంపై  అమెరికా దృష్టికోణంలో నాటకీయమైన మార్పులు వస్తోన్న విషయాన్ని ఈ అంశం వెల్లడిస్తోంది. బైడెన్‌ భావోద్వేగాలతో స్పందిస్తూ.. ఈ సంక్షోభంపై అమెరికా విధానంలో వేగంగా మార్పులు చేస్తున్నారు. రష్యా దళాల క్రూరత్వంపై అమెరికాలోని చాలామంది అభిప్రాయాలకు ప్రతీకగా బైడెన్‌ నిలుస్తున్నారు.

బైడెన్‌ స్పందనకు ఉక్రయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నుంచి మద్దతు లభించింది. "నిజమైన నాయకుడి నుంచి నిజమైన వ్యాఖ్యలు. ఓ దుష్టశక్తికి వ్యతిరేకంగా పోరాడటంలో జరిగిన ఘటనలను వాటి పేర్లతో పిలవడం చాలా అవసరం. అమెరికా సాయానికి కృతజ్ఞతతో ఉంటాం. రష్యన్లను అడ్డుకోవడానికి మరిన్ని భారీ ఆయుధాలు కావాలి" అంటూ ట్విటర్‌లో  పేర్కొన్నారు.

పుతిన్ ను తప్పుబడుతూ ఉక్రెయిన్ లో సైనిక చర్య అని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతున్న దానిని తొలి నుంచీ బైడెన్ ఖండిస్తున్నారు. రష్యా పర్యవసానాలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. ఇటీవల రష్యా ఇంధన దిగుమతులపైనా బైడెన్ పూర్తిగా ఆంక్షలు విధించారు. ఇప్పుడు రష్యా హింసను ఖండించడంలో మరో అడుగు ముందుకేశారు. అక్కడ రష్యా సైనికుల అరాచకాలను తొలిసారి నరమేధంతో పోల్చారు. గతంలో జోబైడెన్‌ ఈ పదం వాడేందుకు ఇష్టపడలేదు.

కానీ, రష్యా దళాలు దాడులు చేసి వెనుదిరిగిన తర్వాత ఆయా నగరాల్లో భయానక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జోబైడెన్‌ తీవ్రంగా స్పందించారు. "నేను దానిని నరమేధమే అంటాను. ఎందుకంటే అసలు ఉక్రెయిన్‌ ఉన్నదన్న ఆలోచనను కూడా కూకటివేళ్లతో సహా పెకలించేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రయత్నిస్తున్నారు. గత వారంలో ఉన్న పరిస్థితికి.. ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. చాలా కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా దళాలు బీభత్సం సృష్టించాయి. మనం భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని చూస్తాం. నా దృష్టిలో ఇది ఓ నరమేధమే" అని విలేకర్లతో అన్నారు.

నిజంగానే నరమేధమే..

ఉక్రెయిన్ లో రష్యా సేనల అరాచకాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. రాజధాని కీవ్ సమీపంలోని బుచా పట్టణం జనాభా యుద్ధానికి ముందు 50 వేలు. ఇప్పుడు 3,700. దీన్నిబట్టే అక్కడ రష్యా ఎలాంటి భయభ్రాంతులకు గురిచేసిందో తెలిసిపోతోంది. వీరిలో చాలామంది ఇళ్లు వదిలివెళ్లిపోగా కనీసం వెయ్యిమందిని రష్యా హతమార్చినట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో అయితే 150 మందిపైనే ప్రజలను రష్యా సేనలు హతమార్చాయి. ఇక మారియుపోల్ లో రష్యా దళాల చేతిలో 20 వేల మందిపైనే చనిపోయారు. అసలు ఈ నగరమే ఓ శ్మశానంలా మారిందంటే ఆశ్చర్యం లేదు.
Tags:    

Similar News