గ్రీన్ కార్డు కోటా రద్దు.. మనోళ్లకు గుడ్ న్యూస్

Update: 2021-06-04 02:30 GMT
అమెరికాలోని ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్. ఏళ్లకు ఏళ్లుగా గ్రీన్ కార్డు (అమెరికాలో శాశ్వత నివాస హక్కు) కోసం ఎదురుచూస్తున్న వేలాది మందికి ఆనందం కలిగించే పరిణామంగా దీన్ని చెప్పాలి. గ్రీన్ కార్డుల జారీకి ఇప్పటివరకు దేశాల వారీగా కోటా ఉండేది. దీన్ని ఎత్తేయాలనే ప్రతిపాదనకు ప్రతినిధుల కాంగ్రెస్ భారీ మెజార్టీతో ఆమోదం లభించింది. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రవాసభారతీయులు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతారన్న మాట వినిపిస్తోంది.

అమెరికా కాంగ్రెస్ లోని జో లోఫ్ గ్రెన్.. జాన్ కర్టిస్ అనే ఇద్దరు సభ్యులు ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ది ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌ కార్డ్స్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌(ఈఏజీఎల్‌ఈ)చట్టం– 2021కు అనుకూలంగా365 మంది ఓటు వేస్తే.. 65 మంది వ్యతిరేకించారు. దీంతో.. ఈ బిల్లు ఆమోదం పొందింది. తదుపరి సెనేట్ లోనూ ఆమోదం పొందటం.. ఆ పై దేశాధ్యక్షుల వారు సంతకం పెట్టేస్తే.. ఈ కలల బిల్లు చట్టంగా మారుతుంది.

ప్రస్తుతం ఉన్న విధానంలో భారతదేశానికి ఏడు శాతం కోటా ఉంది. ఈ కోటాకు మించి ఎక్కువ మందికి గ్రీన్ కార్డు ఇవ్వటానికి అవకాశం లేదు. దీంతో దశాబ్దాల తరబడి హెచ్ 1బీ వీసా మీద అమెరికాలో ఉంటున్న అత్యున్నతస్థాయి నిపుణులకు సైతం గ్రీన్ కార్డు కోసం క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి. తాజాగా ఆమోదం పొందిన బిల్లుతో ఈ కష్టం తీరనుంది.

తాజాగా ఆమోదం పొందిన బిల్లు చట్టంగా మారితే.. వ్యక్తిగత నైపుణ్యాలే ప్రమాణంగా మారతాయి. దీంతో.. మిగిలిన దేశాల వారితో పోలిస్తే.. ప్రవాస భారతీయులకు ఎక్కువగా లబ్థి చేకూరుతుందని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రవాసీయులకు పండుగే అని చెప్పక తప్పదు.
Tags:    

Similar News