ట్రంప్‌కు ఓట‌మి త‌ప్ప‌దా: ‌తేల్చి చెప్పిన ఓ స‌‌ర్వే

Update: 2020-07-21 05:15 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాలో వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న స‌మ‌యంలోనూ ఆ దేశంలో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌ల వాతావ‌రణం ఆ దేశంలో ఉంది. వచ్చే నవంబర్‌లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మ‌రోసారి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి అత‌డి గెలుపు కష్టంగా ఉంద‌ని ప‌రిణామాలు చూస్తుంటే తెలుస్తోంది. గ‌తంలో స్థానికత అనే దాన్ని వినియోగించుకుని ఎన్నిక‌ల్లో అనూహ్యంగా ట్రంప్ అధ్య‌క్షుడిగా గెలిచిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అత‌డి గెలుపుకు మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌ధాన అడ్డంకిగా మారింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. తాజాగా ట్రంప్ ప్ర‌త్య‌ర్థితో వెనుకంజలో ఉన్నాడ‌ని తెలుస్తోంది.

మహమ్మారి వైర‌స్ అధ్యక్షుడి పీఠానికి స‌వాల్ విసురుతోంది. వైరస్‌ను కట్టడి చేయడంలో ట్రంప్‌ విఫలమయ్యారని వాషింగ్టన్‌ పోస్ట్‌, ఏబీసీ న్యూస్‌ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ విష‌యాన్ని మెజారిటీ అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ ఈ విపత్తును ఇంకా మెరుగ్గా ఎదుర్కొనే వారని భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్‌కే తమ మద్దతు అని సర్వేలో పాల్గొన్న 55 శాతం మంది తెలిపారు. ఈ విధంగా ట్రంప్ అమెరిక‌న్ల విశ్వాసం కోల్పోయారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.
Tags:    

Similar News