అమెరికా అధ్యక్షుడి ఇంటి వద్ద కలకలం రేపిన విమానం!

Update: 2022-06-05 09:24 GMT
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంటి వద్ద ఒక విమానం కలకలం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ కాకుండా మరొకటి వాషింగ్టన్ కు 200 కి.మీ.దూరంలోని డెలావేర్ లో ఉంది. అధ్యక్ష విడిదిగా వాడే ఈ భవనం రిహోబత్ బీచ్ లో ఉంది. అయితే దీని చుట్టూ ఉండే నిషేధిత గగనతలంలోకి శనివారం ఓ చిన్న విమానం ప్రవేశించడంతో కలకలం రేగింది. ఆ సమయంలో బైడెన్ తోపాటు ఆయన సతీమణి అందులోనే ఉన్నారు. విమానం కలకలం రేపడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బైడెన్ తోపాటు ఆమె సతీమణిని వేరే చోటుకు సురక్షితంగా తరలించారు. ఎలాంటి ముప్పు లేదని.. ఆ విమానం పొరపాటున ప్రవేశించిందని భద్రతా సిబ్బంది వివరణ ఇచ్చారు.

కాగా గతంలో ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని ఆల్ ఖైదా ఉగ్రవాద అమెరికాలో న్యూయార్కులో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ తోపాటు వైట్ హౌస్ పై విమానాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆనాటి దాడుల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం కుప్పకూలింది. మరోవైపు నాటి అధ్యక్షుడు వైట్ హౌస్ బంకర్ లోకి పారిపోయి తలదాచుకోవాల్సి వచ్చింది. దీంతో నాటి సంఘటన గుర్తుకు రావడంతో ప్రస్తుతం భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్టు అయ్యారు.

జో బైడెన్‌ ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌తో కలిసి ఇటీవలే డెలావేర్‌లోని రిహోబత్‌ బీచ్‌లోని అధ్యక్ష విడిదికి చేరుకున్నారు. తాజాగా విమానం నిషేధిత గగనతంలోకి చేరడంతో భద్రతా సిబ్బంది దాన్ని ఓవైపు బయటకు తరిమారు. అదే సమయంలో మరోవైపు అధ్యక్షుడిని భారీ బందోబస్తు మధ్య మరో సురక్షిత ప్రాంతానికి తరలించారు.

కాగా విమానం పొరపాటున ప్రవేశించిందని తెలియగానే.. తిరిగి జో బైడెన్ నివాసానికి చేరుకున్నారు. నిషేధిత గగనతలంలోకి చొరబడి కలకలం రేపిన పైలట్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తామని పోలీసులు తెలిపారు. విమానం దాడి చేసే లక్ష్యంతో అటుగా రాలేదని ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైందన్నారు. నిషేధిత ప్రాంతంపై పైలట్‌కు అవగాహన లేకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగిందని తేలిందన్నారు.

సాధారణంగా వాషింగ్టన్‌ వెలుపలి ప్రాంతాలకు అమెరికా అధ్యక్షుడు బయలుదేరినప్పుడు ఆయన విడిది చేసే ప్రదేశాల్లో దాదాపు 10 మైళ్ల వ్యాసార్ధం వరకు నో-ఫ్లై జోన్‌గా ప్రకటిస్తారు. మరో 30 మైళ్ల వ్యాసార్ధంలో ఉన్న ప్రాంతాన్ని నిషేధిత గగనతలంగా పేర్కొంటారు. ఫెడరల్‌ ఏవియేషన్‌ నిబంధనల ప్రకారం.. పైలట్లు విమానంలో బయలుదేరడానికి ముందు నిషేధిత గగనతలాల వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ.. తరచూ ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి.
Tags:    

Similar News