అమెరికాలోని ఇండియన్ స్టూడెంట్స్ కు భారీ షాక్

Update: 2017-01-06 05:02 GMT
అమెరికాలో ఇండియన్స్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నిన్నటికి నిన్న రిపబ్లికన్లు.. హెచ్ 1బీ వీసాల జారీకి గండి కొట్టేలా బిల్లును ప్రవేశ పెట్టిన ఆందోళన ఒక కొలిక్కి రాక ముందే.. అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. భారత్ తో పాటు అమెరికాలో చదివే వేలాది మంది విదేశీ విద్యార్థులకు భారీ షాక్ తగలనుంది. ఇంతకీ భారతీయ విద్యార్థులకు తగలనున్న షాకేంటి? ఎందుకు అలాంటి పరిస్థితి చోటు చేసుకుంది? ఈ తాజా షాక్ పుణ్యమా అని అమెరికాలోని తెలుగు విద్యార్థులకు కలిగే నష్టం ఏమిటన్న అంశాల్లోకి వెళితే..

అమెరికాలోని స్వతంత్ర కళాశాలలు.. పాఠశాలలకు జాతీయ స్థాయి సంస్థ అయిన అక్రిడిటింగ్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజీస్ అండ్ స్కూల్స్ గుర్తింపు ఇస్తూ ఉంటుంది. ఇది.. స్టూండెంట్ అండ్ ఎక్సైంజ్ విజిటర్ ప్రోగ్రాం కింద ఎసీఐసీఎస్ గుర్తింపు పొందిన 130 కళాశాలలు..పాఠశాలల్లో సుమారు 16 వేల విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు జరిగిందేమిటంటే.. ఏసీఐసీఎస్ కు ఉన్న గుర్తింపును అమెరికా విద్యాశాఖ రద్దు చేసింది. దీంతో.. అమెరికాలోని వేలాది మంది విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. బాధితుల్లో మిగిలిన దేశాల కంటే ఎక్కువగా భారతీయులు ఉండటం.. వారిలో తెలుగువాళ్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇంతకీ అమెరికా విద్యాశాఖ ఇంత సంచలన నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికితే.. ఏసీఐసీఎస్ లోని 245 విద్యాసంస్థల్లో చాలావరకూ లాభాపేక్షతో నడిచేవే. ఈ విద్యాసంస్థల్లో దాదాపు 60వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యాసంస్థలకు అమెరికా ప్రభుత్వం సాయం కింద గత ఏడాది 4.76బిలియన్ డాలర్లను అందజేసింది. అయితే.. ఏసీఐసీఎన్ పని తీరులో లోపాలు ఉండటం.. బోగస్.. ప్రమాణాలు లేని కళాశాలలకు గుర్తింపు ఇవ్వటం లాంటి అంశాలు ఈ మధ్యన నిర్వహించిన విచారణలో బయటకు వచ్చాయి. దీంతో.. ఏసీఐసీఎస్ గుర్తింపు ఇచ్చిన రెండు కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఈ రెండుకాలేజీలు త్వరలో మూతపడనున్నాయి.

అమెరికా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని భారత విద్యార్థులు ఫ్యూచర్ ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏసీఐసీఎస్ ద్వారా గుర్తింపు పొందిన కాలేజీలకు అమెరికా విద్యాశాఖ 18నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు లోపు కోర్సులు పూర్తి కాని విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న. తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా వేరే కాలేజీలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఫీజు వాపసు ఇచ్చేలా చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు విద్యార్థులకు ఇలాంటి అంశాలపై సాయం చేసేందుకు పలు తెలుగు సంఘాలు పని చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూ మీద మరింత సలహాలు..సమాచారం కోసం తమ వెబ్ సైట్ ను సంప్రదించాల్సిందిగా హోమ్ లాండ్ సెక్యూరిటీ శాఖ చెబుతోంది. ఆ శాఖ వెబ్ సైట్ లింక్.. ICE.gov/SEVP

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News