'ఎంతమంది మిగులుతారు?' ఇదే టీడీపీలో చర్చ!

Update: 2019-05-28 11:32 GMT
నీవు నేర్పిన విద్యే నీరాజాక్ష.. అన్నట్టుగా ఇన్ని రోజులూ ఎడా పెడా ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తన పార్టీ ఎమ్మెల్యేల మీద అనుమానాలు పెరిగిపోతూ ఉన్నాయని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతరఫున నెగ్గిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు.. ఎంతమంది ఎన్ని రోజుల పాటు ఉంటారు? అనేది తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

గత టర్మ్ లో చంద్రబాబు నాయుడు ఎంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుక్కొన్నారో అంతే మంది ఇప్పుడు టీడీపీ తరఫున నెగ్గారు. ఆ లెక్కన చూసుకుంటే.. ఈ ఎమ్మెల్యేలను జగన్ తన వైపుకు మళ్లించుకోవడం ఏ మాత్రం కష్టం కాదు!

జగన్ గట్టిగా దృష్టి పెడితే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టినా.. జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పరిణామాలను గుర్తు చేయవచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో అందరికీ తెలిసిందే. తను చేస్తే రాజకీయం, ఇతరులు చేస్తే తప్పు అని చంద్రబాబు నాయుడు వాదించినా దానికి పెద్దగా పస ఉండదు.

అయితే వైఎస్ జగన్ కు కావాల్సినంతమంది ఎమ్మెల్యేలను ఇచ్చారు ఏపీ ప్రజలు. రికార్డు స్థాయి మెజారిటీని అందించారు. ఇక జగన్ కూడా చంద్రబాబకు తనకూ వ్యత్యాసం ఏమిటో ప్రజలకు చూపించాలనే భావనలో కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఫిరాయింపులు ఉండకపోవచ్చు.

అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం జగన్ తో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కావాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి వారు రెడీగా ఉన్నారట. ఉప ఎన్నికలు వచ్చినా ఎలాగోలా గెలవొచ్చు అనే ధీమా వారిలో ఉందట.

ఇప్పటికే ఈ అంశం చంద్రబాబు వద్దకు కూడా వెళ్లిందని, కనీసం అరడజను మంది ఫిరాయించేందుకు రెడీగా ఉన్నారని బాబుకు సమాచారం అందిందని.. ఇదే ఆయనను బాగా ఆందోళనకు గురి చేస్తున్న అంశమని భోగట్టా!


Tags:    

Similar News