ఆర్జేడీ+జేడీయూ= దేశంలో అతిపెద్ద రాజకీయ విలీనమే?

Update: 2022-12-16 13:30 GMT
ఒకటేమో పదిహేనేళ్లు అధికారంలో ఉన్న వ్యక్తికి చెందిన పార్టీ.. మరోటి పదిహేనేళ్లకు పైగా అధికారంలో కొనసాగుతున్న పార్టీ. రెండు పార్టీల అధినేతలు తొలినాళ్లలో స్నేహితులు. రాజకీయంగా ఒకేసారి ప్రయాణం ప్రారంభించారు. ఒకే పార్టీలో కొనసాగారు.. ఆ తర్వాత సొంతంగా పార్టీలు స్థాపించుకున్నారు. వెరసి నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో వారి పాత్ర కీలకం. అలాంటివారు మళ్లీ కలిసిపోనున్నారా? అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. కలిసి అడుగులు.. విడివిడిగా పరుగులు బిహార్ రాజకీయాల్లో లాలూప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్ లది ప్రత్యేక స్థానం. నాలుగున్నర దశాబ్దాల కిందట ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. జనతాదళ్ నాయకులుగా కీలకంగా ఎదిగారు. అయితే, 1995లో లాలూ విడిపోయి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)ను స్థాపించగా, నితీశ్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్)ను నెలకొల్పారు.

ఇద్దరూ వారి పార్టీల తరఫున సీఎంలుగా ఎన్నికయ్యారు. మరోవైపు 1990-2005 మధ్య కాలంలో లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, 2005 నుంచి మధ్యలో కొంతకాలం తప్ప నీతీశ్ కుమార్ సీఎంలుగా కొనసాగుతున్నారు. అంటే 35 ఏళ్లుగా లాలూ-నీతీశ్ మధ్యనే అధికారం నడుస్తోంది. రాష్ట్ర ఎన్నికల్లో ఈ రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతూ వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు వీటితో పొత్తుపెట్టుకుని బరిలో దిగుతున్నాయి. అలాంటి చోట కొత్త పరిణామం సంభవించనున్నట్లు కనిపిస్తోంది. జేడీయూ, ఆర్‌జేడీ విలీనం కాబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ దిశగా రెండు పార్టీల్లోనూ చర్చ సాగుతోంది. ఆ పార్టీల నేతలు పైకి ఖండిస్తున్నా.. లోపల మాత్రం విలీన సంకేతాలు వదులుతున్నారు. ముఖ్యంగా సీఎం నితీశ్‌.

నితీశ్ ప్రధాని.. తేజస్వి సీఎం

అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొన్ని నెలల కిందట నీతీశ్ కుమార్ బీజేపీతో అనూహ్యంగా తెగదెంపులు చేసుకున్నారు. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీనివెనుక జాతీయ రాజకీయాలపై  ఆయన కన్నేయడమే కారణం. విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చి ప్రధాని పదవి చేపట్టాలనేది నీతీశ్ వ్యూహం. అంతేగాక 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ వారసుడు, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ఎన్నికలకు సారథ్యం వహిస్తారని కూడా ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అధిక సీట్లు సాధించి ప్రధాని పదవికి గట్టి పోటీదారుగా నిలవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.

వేర్వేరుగా పోటీ చేసేకంటే.. జేడీయూ, ఆర్‌జేడీ విలీనమైపోతే రాష్ట్రంలో అతి పెద్ద శక్తిగా అవతరించవచ్చని.. కాంగ్రెస్‌, వామపక్షాలతో చేతులు కలిపితే బీజేపీని చావుదెబ్బ తీయొచ్చని నితీశ్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు. గత అక్టోబరులో జరిగిన ఆర్‌జేడీ కార్యవర్గ సమావేశంలో.. పార్టీ పేరు, ఎన్నికల గుర్తును మార్చే అధికారాన్ని అధినేత లాలూకు అప్పగిస్తూ తీర్మానించడం వెనుక వ్యూహమిదేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రెండు పార్టీలూ కలిసిపోవడం ద్వారా ఆవిర్భవించే కొత్త పార్టీకి నితీశ్‌ సారథ్యం వహిస్తారని ఆర్‌జేడీలోని కొందరు నేతలు అంటున్నారు. తాను ఢిల్లీ వెళ్తే తేజస్వి బిహార్‌ ప్రభుత్వాన్ని నడుపుతారని నితీశ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయం ఆవిర్భవించాలంటే ప్రతిపక్షాల నడుమ విస్తృత ఏకాభిప్రాయం అవసరమని ఆయన పదే పదే చెబుతున్నారు.

రాజకీయాలకు దూరంగా నీతీశ్ కుమారులు.. లాలూకు అనారోగ్యం

నీతీశ్ సొంతంగా పార్టీ చేసి అధికారంలోకి వచ్చినా తిరుగులేని నేతగా బిహార్ ను ఏలుతున్నా ఆయన కుమారులకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. దీంతో జేడీయూ పగ్గాలు వేరే వారికి అప్పగించాల్సిన పరిస్థితి. ఓ దశలో ప్రశాంత్ కిశోర్ ను తీసుకొచ్చినా అతడు ఇమడలేకపోయాడు.

దీనివెనుక సామాజిక కోణం ఉందని చెబుతుంటారు. ఇక లాలూ ప్రసాద్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఆయనకు కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. అంటే ఆర్జేడీకి రాజకీయంగా పెద్దదిక్కు తేజస్వీనే. ఈ నేపథ్యంలోనే  భవిష్యత్ రాజకీయాల రీత్యా ఇరు పార్టీలు విలీనంపై ముందుకెళ్లే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశంలో అతిపెద్ద రాజకీయ విలీనాల్లో ఇదొకటిగా మిగులుతుంది.
Tags:    

Similar News