మమతకు బిగ్ రిలీఫ్

Update: 2021-09-06 07:03 GMT
పశ్చిమ బెంగాల్లో హ్యాట్రిక్ కొట్టిన సీఎం మమతా బెనర్జీకి బిగ్ రిలీఫ్ దొరికినట్లే. మొన్నటి వరకు బెంగాల్ లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయా ? జరగవా అనే సందేహాలు పెరిగిపోయాయి. అలాంటిది కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్ తో మమతకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే తనను ఇబ్బందులు పెట్టడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నట్లు మమత బహిరంగంగానే ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఎన్నికల సంఘం ఉపఎన్నికలకు తేదీలు ప్రకటించటంతో కేంద్రంలోని  పెద్దల కుట్ర ఏమీ లేదని తేలిపోయింది.

ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో అఖండ విజయంతో మూడోసారి సీఎంగా దీదీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. బీజేపీ నేత సువేందు అధికారి పై నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేసిన మమత ఓడిపోయారు. ఈ ఎన్నిక, ఫలితం ప్రకటనపై చాలామందికి అనేక అనుమానాలున్నాయి. ఒకసారి మమత గెలిచినట్లు ప్రకటనొచ్చింది. తర్వాత లేదు లేదు సువేందే గెలిచారని ప్రకటించారు. ఇలాంటి రెండు రకాల ప్రకటనలతో అందరిలోను అనుమానాలు పెరిగిపోయాయి.

దీనికి తగ్గట్లే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే మమత నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన పై కోర్టులో పిటిషన్ వేశారు. అదెప్పుడు తేలుతుందో ఎవరికీ తెలీదు. సరే నందిగ్రామ్ లో ఓడిపోయినా సీఎం అయిపోయిన మమత ఆరుమాసాల్లోగా ఎక్కడో ఓ నియోజకవర్గం నుండి గెలవాలి కదా. ఆ గడువు ఆరు మాసాలు కూడా నవంబర్ 5వ తేదీతో ముగిసిపోతుంది. ఈలోగా కరోనా వైరస్ పేరుతో దేశంలోనే అనేక ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఇందులో భాగంగానే బెంగాల్ లో కూడా ఉప ఎన్నికలు వాయిదా పడటంతో మమత లో ఆందోళన పెరిగిపోయింది. తనను  ఇబ్బందులు పెట్టడానికే కేంద్రంలోని పెద్దలు తెరవెనుక నుండి చక్రం తిప్పుతున్నారంటు ఆరోపణలు గుప్పించారు. అలాగే బెంగాల్ లో ఉప ఎన్నికల నిర్వహణ ఎందుకు అవసరమో వివరిస్తు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. సరే కారణాలు ఏవైనా కానీ మొత్తానికి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీఅయ్యింది. ఇందులో బెంగాల్లోని మూడు  నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. వీటిల్లో  భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మమత పోటీకి రెడీ అయిపోయారు. ఎలాగు పోటీ అనేది లాంఛనమే అని తేలిపోయింది. ఏదేమైనా మమత ఎన్నికల కథ సుఖంతామవబోతోంది.
Tags:    

Similar News