కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్... తెర పైకి కొత్త పేరు!

Update: 2023-06-29 14:00 GMT
వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న బీఆరెస్స్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ బిగ్ షాక్ ఇవ్వనున్నారనే ఊహాగాణాలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తెరపైకి మరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం.

హుజూరాబాద్ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో బలం పెంచుకొని ఎన్నికలలో ఈటలను బలంగా ఢీ కొడతాడు అని అధినేత భావిస్తే... కౌశిక్ రెడ్డి మాత్రం వరుస వివాదాలతో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఒక వీడియో జర్నలిస్టుపై దురుసుగా ప్రవరించారని, కెమెరా లాక్కుని కులంపేరుతో దూషించారంటూ వచ్చిన వార్తలు మరీ హాట్ టాపిక్ గా మారాయి.

ఇదే సమయంలో కౌశిక్ రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు ముదిరాజ్ సంఘం నేతలు. జూన్ 22న  హుజురాబాద్ లో ముదిరాజ్ కులాన్ని కించపరిచే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని.. ఒక కెమెరా మెన్ ను కులం పేరుతో తిట్టి అవమానించారని.. అతన్ని కఠినంగా శిక్షించాలని డీజీపీని కోరామని ముదిరాజ్ సంఘం నేతలు తెలిపారు. ఇలా వరుసగా వస్తోన్న వివాదాల నేపథ్యంలో... హుజూరాబాద్ లో ఈటలపై పోటీకి కౌశిక్ కరెక్ట్ క్యాండిడేటేనా అనే విషయంలో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారని వార్తలొస్తున్నాయి.

వాస్తవానికి కౌశిక్ రెడ్డిని కేటీఆర్ బాగా ప్రోత్సహించినట్లు కనిపించేది. ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడంతోపాటు ఈ మధ్యకాలంలో హుజూరాబాద్ ఇన్ ఛార్జ్ ని చేశారు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచేది పాడి కౌశిక్ రెడ్డే, అతని విజయానికి సహకరించండి అంటూ కేటీఆర్ ప్రకటించారు! దీంతో స్థానికంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ వర్గం తీవ్రంగా కౌశిక్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించింది.

దీంతో తాజాగా ఈటల రాజేందర్ పై పోటీకి ఇనుగాల పెద్దిరెడ్డిని దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికి ఈసారి బీఆరెస్స్ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపై కేసీఆర్ ఇప్పటికే అభిప్రాయాలు సేకరిస్తున్నారనేది ఆ వార్త సారాంశంగా ఉంది.

మరి నిజంగానే కౌశిక్ రెడ్డి విషయంలో కేసీఆర్ సెకండ్ థాట్ కి వెళ్తున్నారా.. లేక ఇవన్నీ ఊహాగాణాలు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది!

కాగా... 2018 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన కౌశిక్ రెడ్డి... ఈటల రాజేందర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఈటలకు 43,719 మెజారిటీ వచ్చింది. అనంతరం కౌశిక్ రెడ్డి బీఆరెస్స్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుతం హుజురాబాద్ బీఆరెస్స్ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు.

Similar News