ట్రంప్ కు భారీ షాక్.. అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా చెత్త రికార్డు

Update: 2019-12-19 05:10 GMT
తానేం చేసినా నడిచిపోతుందన్న ధీమా కొందరు దేశాధ్యక్షుల్లో కనిపిస్తుంటుంది. ఇందుకు నిలువెత్త నిదర్శనంగా కనిపిస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణల్ని ఎదుర్కొంటున్న వైనం తెలిసిందే. ప్రతిపక్ష డెమొక్రాట్ల అధిపత్యం ఉన్న ప్రతినిధుల సభలో ట్రంప్ అభిశంసనకు ఆమోదం తెలపటంతో ఆయన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనక తప్పని పరిస్థితి.

అమెరికా అధ్యక్షులుగా పని చేసిన వారిలో ఈ తరహాలో అభిశంసనను ఎదుర్కొన్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. సెనెట్ లో ఆయన అభిశంసన ఎదుర్కొంటారు. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జోయ్ బైడన్ నుంచి గట్టి పోటీ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇలాంటివేళ.. బైడన్ ను రాజకీయంగా దెబ్బ తీయటానికి వీలుగా ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవటానికి సిద్ధమైనట్లుగా ఆరోపణలు వెల్లువెత్తటం తెలిసిందే. బైడన్ కుమారుడు హంటర్ బైడన్ కు ఉక్రెయిన్ లో భారీ ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి. కొడుకు వ్యాపారాల్ని దెబ్బ తీయటం ద్వారా తండ్రిని దారికి తేవాలని ట్రంప్ అనుకుంటే.. ఆయన ఆలోచన రివర్స్ లో అభిశంసన రూపంలో ఇప్పుడు ఇబ్బంది పెడుతోందన్న మాట వినిపిస్తోంది.

తన ప్రత్యర్థిని దెబ్బ తీసేందుకు వీలుగా ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం కోసం ఆ దేశానికి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉక్రెయిన్ కు భారీ ఆర్థిక సాయాన్ని ఇవ్వటం ద్వారా.. ఆ దేశంలో బైడెన్ కుమారుడి పై ఉన్న అవినీతి కేసుల విచారణను వేగవంతం చేయాలని ఉక్రెయిన్ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.

తన మీద వస్తున్న ఆరోపణల్ని ట్రంప్ కొట్టిపారేశారు. అవన్ని అబద్ధాలుగా చెప్పారు. ఇలాంటివేళ ఆడం చిప్ నేతృత్వంలో ట్రంప్ పై అభిశంసన చేపట్టాలా? లదా? అన్న అంశంపై మీద విచారణ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఇదే సమయంలో ప్రతినిధుల సభ ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా.. సభ దాన్ని ఆమోదించింది. దీంతో.. ట్రంప్ అభిశంసనకు గురైనట్లుగా స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రకటించారు.

అమెరికాలో అత్యున్నత స్థానాల్లో ఉన్న అధినేతల్ని.. కీలక అధికారుల్ని పదవుల నుంచి దించేందుకు ఈ అభిశంసన విధానాన్ని అమలు చేస్తుంటారు. అధికారాన్ని దుర్వినియోగం చేసే వారికి.. దేశ ద్రోహానికి పాల్పడే వారికి.. లంచాలు ఇవ్వటం లాంటి నేరాలకు పాల్పడ్డారంటూ అభిశంసన చేసే అధికారం అమెరికా కాంగ్రెస్ కు ఉంది. అయితే.. ప్రతినిధుల సభ ఆమోదించినంత తేలిగ్గా ట్రంప్ ను పదవి నుంచి దింపలేరు. సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది.

అధ్యక్షుల వారిపై నమోదైన అభియోగాలు సాక్ష్యాధారాలతో స్వతంత్రప్రతిపత్తి కలిగిన హౌస్ జ్యుడీషియరీ కమిటీ విచారణ జరుపుతుంది. ఆరోపణలు రుజువైతే 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభ సాధారణ మెజార్టీతో అభిశంసనను ఆమోదించాల్సి ఉంటుంది.అయితే.. సెనేట్ లో రిపబ్లికన్ల అధిపత్యం ఉన్నందున ట్రంప్ అభిశంసన వీగిపోయే అవకాశాలే ఎక్కువనిచెప్పక తప్పదు. కాకుంటే.. మచ్చలా ఈ అభిశంసన అలా మిగిలిపోనుంది.
Tags:    

Similar News