ఏపీ ఉద్యోగుల్లో భారీ చీలిక...రాజకీయంతో ఎవరెటు...?

Update: 2023-01-19 14:18 GMT
ఏపీ ఉద్యోగులలో అతి పెద్ద చీలిక వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీ ఎన్జీవోలు ఒక వైపు ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు మరో వైపు ఉన్నారు. ఇక లేటెస్ట్ గా ఒక సన్నివేశం చూస్తే భారీ చీలిక వచ్చిందా అని అనిపించకమానదు. ప్రభుత్వ ఉద్యోగులు సంఘం ప్రెసిడెంట్ సూర్యనారాయణ నాయకత్వంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ని కలసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఫిర్యాదు చేశారు.

ఇది ఏపీ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే అరుదైన ఘటనగా చూస్తున్నారు. ప్రభుత్వం అంటే ఉద్యోగులూ భాగమే. ఇక గవర్నర్ తో కలుపుకునే ప్రభుత్వంగా అభివర్ణిస్తారు. అలాంటిది తమ ప్రభుత్వం పై రాజ్యాంగ రక్షకుడు అయిన గవర్నర్ వద్దకు ఉద్యోగులు వెళ్లడం అంటే తీవ్రమైన విషయంగానే పరిగణించాలి అంటున్నారు.

అయితే ఇది అనివార్యం అయిందని, గత్యంతరం లేకనే తాము వెళ్లాల్సి వచ్చిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ సూర్యనారాయణ మీడియాకు చెప్పారు. తమకు ప్రతీ నెలా ఒకటవ తేదీన జీతాలు కూడా పడడం లేదని గవర్నర్ దృష్టికి తెచ్చామని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంతా ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో ఉన్నారని గవర్నర్ దృష్టికి  తెచ్చామని చెప్పడం సంచలనమే అవుతోంది.

అంతేకాదు ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను సైతం ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని తమను అలా వదిలేసిందని ఆయన ఫిర్యాదు చేసిన దాంట్లో ఉంది. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్ నుంచి ఏకంగా 90 వేల మంది ఖాతల ద్వారా విత్ డ్రా చేసింది ప్రభుత్వం అన్న ఆరొపణ కూడా తీవ్రమైనదే. తమకు న్యాయం జరగకపోతే ఏప్రిల్ నుంచి ఆందోళనా పధంలోకి వస్తామని రోడ్ల మీదనే తమ ఆందోళనలు అని కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు.

గవర్నర్ ని ప్రభుత ఉద్యోగులు కలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని ఏపీ ఎన్జీవో సంఘం ప్రెసిడెంట్ బండి శ్రీనివాసరావు ఇతర ప్రతినిధులు కలిశారు. నూతన సంఘం ఏర్పాటు తరువాత సీఎం ని కలిశామని వారు చెప్పడం విశేషం. సీఎం జగన్ తమను అభినందించారని వారు అంటున్నారు. బండి శ్రీనివాసరావు అయితే ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ ని కలవడం మీద మండిపడుతున్నారు. ఇది సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకమని అన్నారు

ప్రభుత్వం తలచుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని రద్దు చేయగలదని కూడా హింట్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ సూర్యనారాయణ వెనక ఎవరు ఉన్నారో ఆయన చేత ఈ మాటలు విమర్శలు ఎవరు చేయిస్తున్నారో తమకు తెలుసు అని బండి కొన్ని కామెంట్స్ చేశారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఇపుడు అడ్డంగా చీలిపోయారు అని అర్ధమవుతోంది.

ఒకే రోజు ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ ని కలసి ఫిర్యాదు చేస్తే మరొకరు సీఎం ని కలసి వచ్చారు. పైగా మీ వెనక ఎవరున్నారో అని ఒకరు అంటే ప్రభుత్వానికి ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు అని మరొకరు ఆరోపిస్తున్నారు. మరి ఇలా నిలువునా ఉద్యోగులు చీలడం కూడా గతంలో జరగలేదు. ఇపుడు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఎన్నికల వేళ మరెన్ని చిత్రాలు చోటు చేసుకుంటాయో అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News