ఎంత డబ్బుంటే ఏం..? లోకంలో నూకలు ఉండాలి కదా? దిగ్గజ ఫుట్ బాలర్ ఇంట విషాదం

Update: 2022-04-19 09:30 GMT
ఫుట్ బాల్ ప్రపంచంలో పీలే, మారడోనా తర్వాత అంతటి వాడిగా పేరుతెచ్చుకున్నపోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్టో ఇంట విషాదం నెలకొంది. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ ఫుట్ బాలర్ అయిన రొనాల్డో కు ఇటీవల జన్మించిన కవలల్లో మగ శిశువు చనిపోయాడు. ఈ విషయాన్ని రొనాల్డో, ఆయన సహచరి జార్జియానా రొడ్రిగెజ్ ప్రకటించారు. వీరికి కొద్ది రోజుల కిందట కవలలు (ఆడ శిశువు, మగ శిశువు) జన్మించారు. కాగా, రొనాల్డో, రోడ్రిగెజ్ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు గత అక్టోబరులో ప్రకటించారు.

అదే సమయంలో కవలలు పుట్టబోతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే.. వీరిలో మగ శిశువుకు భగవంతుడు ఆయుష్సు ఇవ్వలేదు. ఈ విషాదాన్ని దిగమింగుతూ ''ఇది మాకొక అత్యంత విషాదకర సందర్భం. మేం దిగ్భ్రమ చెందాం. ఏ తల్లిదండ్రులకైనా ఇది భరించలేని బాధ. దీనిని అధిగమించే శక్తిని మా అమ్మాయి మాత్రమే మాకు ఇవ్వగలదు. శక్తి వంచన లేకుండా పనిచేసిన వైద్యులు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు'' అంటూ రొనాల్డో, రొడ్రిగెజ్ ప్రకటన విడుదల చేశారు. తమ వ్యక్తిగత ప్రశాంతతకు ప్రాధాన్యమివ్వాల్సిందిగా ఈ సందర్భంగా వారు కోరారు.

రియల్ మాడ్రిడ్ పరిచయం

రొనాల్డో రియల్ మాడ్రిడ్ ఫుట్ బాల్ క్లబ్ కు ఆడుతున్న సందర్భంలో రొడ్రిగెజ్ పరిచయం. వీరు 2017 నుంచి లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ దంపతులకు ఇప్పటికే నాలుగేళ్ల కూతురు ఉంది. వీరే కాక రొనాల్డో కు మరో ముగ్గురు పిల్లలున్నారు. కాగా, రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ కు మారాడు. భారీ ప్యాకేజీతో ఇటీవల ఈ మార్పు జరిగింది. వ్యక్తిగత విషాదంలో ఉన్న అతడికి మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ సంఘీభావం తెలిపింది. ''నీ బాధ మా బాధ. ఈ సమయంలో మీకు ఆ భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేసింది.

మరోవైపు రొనాల్డోకు మద్దతుగా సోషల్ మీడియాలో సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. జమైకా దిగ్గజ అథ్లెట్ యోహాన్ బ్లేక్  సహా పలువురు ఆటగాళ్లు సానుభూతి వ్యక్తం చేశారు. తామంతా నీతోనే ఉంటామంటూ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ పేర్కొంది. కాగా,రొనాల్డో, రొడ్రిగెజ్ లకు 2017లో అలానా మార్టినా జన్మించాడు. మరోవైపు 2017 జూన్ లో రొనాల్డో, మరో మహిళలకు సరోగసీ ద్వారా కవల పిల్లలు ఎవా, మాటియో పుట్టారు. అంతకుముందే వీరికి కుమారుడు (క్రిస్టియానో రొనాల్డో జూనియర్) ఉన్నాడు. అయితే, రొనాల్డో మొదటి సహచరి ఎన్నడూ మీడియా ముందుకు రాలేదు. ఆమె పేరు కూడా ఎవరికీ తెలియదు.

అత్యంత సంపన్న ఆటగాడు

ఫుట్ బాల్ లోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఫుట్ బాలర్ రొనాల్డో. 37 ఏళ్ల ఈ పోర్చుగల్ స్టార్ ఇప్పటివరకు 800 పైగా గోల్స్ కొట్టాడు. 2014 లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా టైమ్స్ రొనాల్డోనే గుర్తించింది.

కెరీర్ లో బిలియన్ అమెరికన్ డాలర్లు సంపాదించిన తొలి ఫుట్ బాలర్ రొనాల్డోనే కావడం విశేషం. ఇటీవల అతడు 500 మిలియన్ డాలర్లకు యువంటెస్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్ కు మారాడు. మాంచెస్టర్ కు ఆడినందుకు గాను అతడు 27 మిలియన్ డాలర్లను ఆర్జించనున్నాడు. నైకీ సహా అనేక అంతర్జాతీయ బ్రాండ్లకు రొనాల్డో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
Tags:    

Similar News