కేసీఆర్‌ కు త‌న సత్తా చూపించ‌నున్న కోదండ‌రాం

Update: 2017-02-14 05:35 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ఇటీవ‌లి కాలంలో త‌న దూకుడు పెంచిన టీజేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఈనెల 22న త‌న స‌త్తా చాటానున్నార‌ని అంటున్నారు. టీఆర్ ఎస్ అధినేత హోదాలో ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన ల‌క్ష ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల్సిందేన‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న  నిరుద్యోగుల ర్యాలీని చేప‌ట్ట‌నున్న‌ట్లు కోదండ‌రాం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ర్యాలీ కేసీఆర్ రెండున్న‌రేళ్ల పాల‌న స‌మ‌యంలో అతిపెద్ద నిర‌స‌నగా నిలుస్తుంద‌ని చెప్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ స‌హా తెలుగుదేశం - వామ‌ప‌క్షాలు - ఇతర‌ విద్యార్థి సంఘాలు మ‌ద్ద‌తిచ్చిన నేప‌థ్యంలో ఈ భారీ ర్యాలీ టీఆర్ ఎస్ స‌ర్కారుపై జరిగిన‌ అతిపెద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మ‌మనే గుర్తింపును ద‌క్కించుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

హామీ ఇచ్చిన ల‌క్ష ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డం, తెలంగాణ‌లోని నిరుద్యోగులంద‌రికీ ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా కోదండ‌రాం పిలుపునిచ్చిన ఈ కార్య‌క్ర‌మం ఫిబ్ర‌వ‌రీ 22న ఉద్య‌మాల పురుటిగ‌డ్డ అయిన ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ప్రారంభం కానుంది.  న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న‌ గ‌న్ పార్క్ వ‌ద్ద‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఆందోళ‌న‌కు తెలంగాణ జేఏసీ ద‌ర‌ఖాస్తు చేసుకోగా పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. అయినప్ప‌టికీ త‌మ ధ‌ర్నా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కొన‌సాగి తీరుతుంద‌ని టీజేఏసీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. దీనికి బ‌లం చేకూర్చే విధంగా జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఇప్ప‌టికే ప‌లు రూపాల్లో మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. మీడియా నుంచి స‌రైన స‌హ‌కారం లేక‌పోవ‌డాన్ని గ్ర‌హించిన కోదండ‌రాం సోష‌ల్ మీడియా వేదిక‌గా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ఫేస్ బుక్ లైవ్ ద్వారా త‌న భావాల‌ను బ‌లంగా వినిపిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మూడు లైవ్ లు నిర్వ‌హించ‌గా భారీ స్పంద‌న రావ‌డం విశేషం. మొత్తంగా, తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా సాగుతున్న అతి భారీ నిరస‌న కార్య‌క్ర‌మం ఏ విధంగా సాగ‌నుంద‌నే ఉత్కంఠ  తెలంగాణ‌వాదుల్లో నెల‌కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News