నితీష్ సొంతంగా వెళుతున్నారా ?

Update: 2022-06-02 03:29 GMT
చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న కులగణన తొందరలో టేకప్ చేయబోతున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. కుల-మతాల సామాజిక, ఆర్ధిక సర్వే జరిపేందుకు నరేంద్రమోడి సర్కార్ ఇష్టపడటంలేదు. దేశంలోని చాలా రాష్ట్రాలు కుల, మత పరమైన సామాజిక ఆర్ధిక సర్వే జరపాలని డిమాండ్లు చేస్తున్న మోడి సర్కార్ మాత్రం సానుకూలంగా స్పందించటంలేదు. దాంతో ఇక లాభంలేదని బీహార్ ముఖ్యమంత్రే తనంతట తానుగా సొంతంగా నిర్ణయం తీసేసుకున్నారు.

ఈ విషయం రుచించకపోయినా మిత్రపక్షమే అయినా  బీహార్లో బీజేపీ చేయగలిగేదేమీలేదు. ఎందుకంటే రాష్ట్రంలోని అన్నీ పార్టీలు ఏకగ్రీవంగా కులగణనకు అంగీకరించాయి. ఇదే విషయమై నితీష్ ఆధ్వర్యంలో పాట్నాలో అఖిలపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో అన్నీ పార్టీలు కులగణన చేయాల్సిందే అని కోరటంతో వేరేదారిలేక బీజేపీ నేతలు  కూడా చేతులెత్తారు. జాతీయస్ధాయిలో కుల, మతగణనతో పాటు సోషియో ఎకనామిక్ సర్వేకి మోడి ప్రభుత్వం ఎందుకు ఇష్టపడటంలేదో అర్ధం కావటంలేదు.

ప్రతి పదేళ్ళకొకసారి దేశంలో కుల, మతగణన చేయటం సంప్రదాయంగా వస్తోంది. అలాంటిది ఇపుడా సంపద్రాయం పోయింది. దీనివల్ల ఏ కులంలో జనాభా ఎంతమందున్నారు, ఏమతంలో ఎంత జనాభా ఉన్నారనే విషయంపై క్లారిటి వస్తే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్దిదారులపై ఒక క్లారిటివస్తుంది. దీన్నిబట్టే ఆర్ధిక కేటాయింపులు కూడా ఉంటాయన్న విషయం నిపుణులు ఎప్పటినుండో మొత్తుకుంటున్నారు.

ఒకవైపు ప్రభుత్వాలు మరోవైపు ప్రతిపక్షాలు అలాగే ఆర్ధికరంగ నిపుణులు పదే పదే అడుగుతున్నా కేంద్రం మాత్రం ఈ సర్వేకి ఇష్టపడటంలేదు. అందుకనే మిత్రపక్షం వైఖరితో విసిగిపోయిన నితీష్ తేనెతుట్టను కదపాలని నిర్ణయించుకున్నట్లున్నారు.

తొందరలోనే కుల, మతగణన మొదలవుతుందని ప్రకటించారు. ఒకసారి బీహార్లో ఇలాంటి సర్వే మొదలైందంటే బీజేపీయేతర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశముంది. కాకపోతే దీనికి పెద్దఎత్తున నిధులు అవసరమవుతుంది. అందుకనే సర్వే చేయాలని డిసైడ్ చేసిన నితీష్ కుమార్ అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయటం గమనార్హం.
Tags:    

Similar News