బీహారీ నితీష్ : జగన్ని దీవించాడు...బాబుకు అడ్డం కొట్టాడు

Update: 2022-08-17 02:30 GMT
దేశంలో ఎక్కడ ఏ రాజకీయ పరిణామం జరిగినా దాని ప్రభావం జాతీయ స్థాయిలో అంతటా ఉంటుంది. అసలే పొత్తుల ఎత్తుల జిత్తుల మారి వర్తమాన  రాజకీయాలలో ఒక పార్టీ ఈ తక్కెడ నుంచి ఆ తక్కెడలోకి జంప్ చేసింది అంటే దాని ఇంపాక్ట్ ఆసేతు హిమాచలంలోనూ  తప్పకుండా ఉంటుంది. ఇపుడు కూడా అదే జరుగుతోంది. బీహారీ బాబు నితీష్ కుమార్ కి సడెన్ గా మోడీ మీద ఆగ్రహం కలిగింది. అదే టైమ్ లో తన దీర్ఘకాల మిత్రుడు లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ మీద అనుగ్రహం కలిగింది.

అంతే ఆయన ఎన్డీయే నుంచి ఆర్జేడీ కూటమి వైపు మొగ్గారు. బీహార్ లో బీజేపీకి అధికారం పోయింది. ఆ ప్రభావం అక్కడితో ఆగలేదు. రాజ్యసభ లెక్కలలో  కూడా  తేడాపాడాలు చేసి పారేసింది. దాంతో అసలే అంతంత మాత్రం మెజారిటీతో నెట్టుకువస్తున్న ఎన్డీయే బలం ఒక్కసారిగా తారు మారు అయింది.

రాజ్యసభలో నితీష్ పార్టీ జేడీయూకి అయిదుగురు ఎంపీలు ఉన్నారు. వారంతా ఇపుడు విపక్ష సభ్యులు అయిపోయారు. దాంతో ఎన్డీయేకు అక్కడ ఉన్న 115 మంది సభ్యుల బలం కాస్తా 110 కి తగ్గిపోయింది. అయితే రాజ్యసభలో మరో నాలుగు ఖాళీలు భర్తీ చేస్తారు. అవి కూడా ఎన్డీయే ఖాతాలో పడినా కూడా అవతల వైపు 121 మ్యాజిక్ నంబర్ కి ఎన్డీయే చేరుకోవడం కష్టం.

రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలీ అంటే కనీసంగా ఏడుగురు మెంబర్స్ మద్దతు అవసరం అవుతుంది. దాంతో ఇపుడు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో కూడా తేడా కొట్టేసేలా ఉందిట. నిజానికి ఈ మధ్యనే ఆజాదీ కా అమృతోత్సవ్ కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో అయిదు నిముషాల పాటు మాట్లాడిన చంద్రబాబు ఇక టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చేశామని అనుకున్నారు. అంతే కాదు ఏపీలో జగన్ సర్కార్ ని కట్టడి చేయడానికి మోడీ అభయహస్తం తనకు తప్పక  ఉంటుందని బలంగా నమ్ముతున్నారు.

అయితే ఇపుడు ఢిల్లీ సీన్ ని అదే చేత్తో ఏపీ సీన్ ని ఒక్కసారిగా మార్చేశారు నితీష్ బాబు. దాంతో ఈ దెబ్బకు రాజకీయ తూకంలో వైసీపీదే పై చేయి అవుతోంది. వైసీపీ అండ లేకపోతే బీజేపీ కీలక బిల్లులు రాజ్యసభలో నెగ్గవంటే నెగ్గవు. దాంతో జగన్ తో రాజీకే అటు మోడీ అయినా ఇటు అమిత్ షా అయినా ఇక మీదట కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏ పీ వరకూ జగన్ కి ఇష్టం లేని పనులు చేయడానికి కూడా వారు సాహసించే సీన్ లేదు.

చంద్రబాబుకు షేక్ హ్యాండ్ తోనే స్వీట్ డ్రీమ్స్ లోకి పంపించినా బీజేపీ పెద్దలే దానికి  అక్కడితోనే తెర వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక జగన్ మళ్ళీ ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్ద చక్రం తిప్పే చాన్స్ వచ్చిపడింది. దాంతో ఇపుడు వైసీపీ నేతలు హుషార్ గా ఉన్నారు. నితీష్ తెచ్చిన ఈ కొత్త చిక్కుల వల్ల బీజేపీ నేతలు ఇప్పట్లో బాబు వైపు కనీసం చూసేందుకు కూడా ఇష్టపడరు అని అంటున్నారు. దాంతో జగన్ కి నితీష్ దీవించి నెత్తిన పాలు పోసినట్లు అయింది. అదే టైం లో చంద్రబాబు ఢిల్లీ ఆశలకు, బీజేపీతో మైత్రికి అడ్డం కొట్టినట్లూ అయింది అంటున్నారు.
Tags:    

Similar News