పెద్ద క్వశ్చన్: నితీశ్ హీరోనా? జీరోనా?

Update: 2022-08-10 16:30 GMT
ఇప్పుడో పెద్ద ప్రశ్న తెర మీదకు వచ్చింది. బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుపరిచితుడు నితీశ్ కుమార్ హీరోనా? జీరోనా? అతివాద బీజేపీతో కలిసి ప్రయాణించిన మితవాద రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. మోడీషాలను తనదైన శైలిలో కంట్రోల్ చేసిన సత్తా ఆయన సొంతం.

అసెంబ్లీలోని సీట్లలో కేవలం 20 శాతానికి కాస్త ఎక్కువగా మాత్రమే ఉన్న సీట్లతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటం అంత తేలిక కాదు. అత్యాశకు కేరాఫ్ అడ్రస్ గా పేర్కొనే నరేంద్ర మోడీ లాంటి నేతకు తమ పార్టీకి చెందిన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకోవటానికి వీల్లేని విధంగా.. తనను మాత్రమే ముఖ్యమంత్రిని చేయాలన్న ఆప్షన్ తప్పించి మరేమీ లేకుండా చేసిన నితీశ్ తెలివిని తక్కువగా అంచనా వేస్తే తప్పులో కాలేసినట్లే అవుతుంది.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలోఒక క్రమపద్దతిలో వరుస పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల్ని కూలుస్తూ వస్తున్న వేళ.. మోడీ మాష్టారికే షాకివ్వటం అంత తేలికైన విషయం కాదు. నిజానికి బిహార్ లో ముఖ్యమంత్రిగా ఉన్న తన మిత్రుడు నితీశ్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నదంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలో మాదిరి  బిహార్ అధికారపక్షమైన జేడీయూలోఅసమ్మతి నేత ఆర్సీపీ సింగ్ సాయంతో పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నినట్లుగా ఆరోపణలు రావటం.. అదే సమయంలో తమకు ఏ మాత్రం సారూప్యత లేని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా.. బీజేపీకి కటీఫ్ చెప్పేసిన తీరు.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తనను దెబ్బేసేందుకు మోడీషాలు పావులు కదుపుతుంటే.. ఆ విషయాన్ని ముందే పసిగట్టి.. ముప్పు తన వద్దకు వచ్చే దానికి ముందే తానే దెబ్బేసి తప్పించుకున్న ధీరుడిగా నితీశ్ మారారు.

తాజా పరిణామాల్ని చూసినప్పుడు నితీశ్ ను రాజకీయ అవకాశవాదిగా ముద్ర వేయొచ్చు. కానీ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్నదేమిటి? వారు చేస్తే లేని తప్పు.. అరకొర బలం ఉన్న ఒక పార్టీకి చెందిన ముఖ్యమంత్రి తెలివిగా మోడీషాలాంటి వారినే దెబ్బ కొట్టటం ఆయనకు కలిసి వచ్చింది. మిగిలిన సందర్భాల్లో అయితే ఆయన జీరోగా ఉండేవారు కానీ.. మోడీషా వంటి బలమైన నేతల్ని దెబ్బ తీయటంతో ఆయనిప్పుడు హీరోగా మారినట్లుగా చెప్పక తప్పదు.

పలు ప్రాంతీయ పార్టీల ఉసురు తీసి.. తాము అధికారంలోకి వస్తున్న బీజేపీకి వారికి అలవాటైన పద్దతిలో బుద్ధి చెప్పటం సామాన్య విషయం కాదు. అందులో నితీశ్ సాధించిన విజయం ఆయన్ను మిగిలిన వారికి ప్రత్యేకంగా మార్చిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News