మీడియాపై తేజ‌స్వీ అనుచ‌రుల వీరంగం!

Update: 2017-07-12 16:27 GMT
ప‌ట్నాలో ఉప ముఖ్యమంత్రి చూస్తుండ‌గానే మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది.  విలేక‌రుల‌పై ఆయ‌న వ్యక్తిగ‌త సిబ్బంది పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘ‌ట‌న బిహార్‌ సెక్రటేరియట్‌ వద్ద జ‌రిగింది.  సెక్రటేరియట్ నుంచి బ‌య‌ట‌కు రాబోతున్న తేజస్వీ యాద‌వ్ ను ప్ర‌శ్నించ‌బోయిన మీడియాపై ఆయ‌న వ్యక్తిగత సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.

బిహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్ - ఆయన కుటుంబ సభ్యుల మీద సీబీఐ అవినీతి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తేజ‌స్వీ యాదవ్‌ పై తీవ్ర ఆరోపణలు రావ‌డంతో ఆయ‌న‌ వివరణ ఇవ్వాలని జేడీయూ మంగళవారం డిమాండ్ చేసింది. నేరుగా తేజస్వి రాజీనామా చేయాల‌ని నితీష్  కోరకపోయినా, దాదాపు అదే స్థాయిలో జేడీయూ స్పందించింది.  

అయితే, అందుకు లాలూ ప్ర‌సాద్, తేజ‌స్వీ సుముఖంగా లేర‌ని స‌మాచారం. ఈ నేపథ్యంలో బిహార్‌లో  రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. బుధ‌వారం మధ్యాహ్నం తేజస్వీ యాదవ్‌ కోసం సెక్రటేరియట్‌ వద్ద మీడియా ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ఆయన బయటకు వచ్చే సమయంలో ప్రశ్నించేందుకు మీడియా ప్ర‌తినిధులు య‌త్నించారు.

దీంతో, ఆగ్ర‌హించిన ఆయన వ్యక్తిగత సిబ్బంది మీడియా ప్రతినిధులను ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లి దాడి చేశారు. దీనిపై పలు మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ముందే ఇది జరుగుతున్నా ఆయన పట్టించుకోకుండా ఉండటంపట్ల మండిప‌డుతున్నాయి.
Tags:    

Similar News