నా భార్య గుట్కాలు తింటోంది.. విడాకులివ్వండి.. కోర్టు ఏమందంటే!

Update: 2022-12-28 03:30 GMT
ఇటీవ‌ల కాలంలో విడాకుల కేసులు త‌ర‌చుగా తెర‌మీదికి వ‌స్తున్నాయి. వీటిలో పెద్ద పెద్ద కార‌ణాలు క‌నిపించ‌డం.. సిల్లీ విష‌యాలే క‌నిపిస్తున్నాయి. అయినా.. కూడా కేసులు మాత్రం ఆస‌క్తి రేపుతున్నాయి. ఇటీవల త‌న భ‌ర్త త‌న‌కు మేక‌ప్ కోసం డ‌బ్బులు ఇవ్వ‌డం లేద‌ని ఓ భార్య విడాకులు కోరిన విష‌యం మ‌రిచిపోక‌ముందే.. తాజాగా ఓ భ‌ర్త‌.. త‌న భార్య గుట్కాలు తింటోంది.. మందు తాగుతోంది.. విడాకులు ఇవ్వండ‌ని కోర్టుకు వెళ్లారు. మ‌రి దీనిపై కోర్టు ఏమందో తెలుసా?!

ఛత్తీస్‌గఢ్‌లోని   బంకి గ్రామానికి చెందిన ఉదయ్‌కి కత్ఘోరాకు చెందిన యువతితో 2015 మే 19న వివాహమైంది. సాధారణంగా వివాహమైన కొత్తలో దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ ఈ వ్యక్తి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. పెళ్లి తర్వాత వారానికే.. భర్తకు సమస్య వచ్చి పడింది.

వారం రోజుల తర్వాత ఓ రోజు రాత్రి సమయంలో భార్య.. మంచంపై స్పృహ తప్పి పడిపోయింది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతూ ఉండడంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు.. ఆమె మత్తు పదార్థాలకు బానిసగా మారిందని గుర్తించారు.

ముఖ్యంగా గుట్కాలు, తంబాకు తింటోంద‌ని చెప్పారు. ఈ విషయం తెలుసుకుని.. ఆమె భర్తతో పాటూ కుటుంబ సభ్యులు మొత్తం షాక్ అయ్యారు. ఇంటికి వ‌చ్చి ప‌రిశీలించారు. ఇంటి గోడ‌ల‌పై గుట్కా ఉమ్ములు క‌నిపించాయి. దీంతో న‌చ్చ‌జెప్పాడు. కొన్ని రోజులు పోతే భార్య ప్రవర్తనలో మార్పు వస్తుందని భావించాడు. కానీ ఆమె ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. కొన్నిసార్లు విసుగొచ్చి గట్టిగా వాదించడంతో భార్య ఆత్మహత్యాయత్నం చేసింది.

దీంతో చివరకు విసిగిపోయిన భర్త.. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అభ్యర్థించాడు. అయితే ఇక్కడ అతడి పిటిషన్‌ తిరస్కర‌ణ‌కు గురైంది. చివరకు ఛత్తీస్‪‌గఢ్ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య తరచూ గుట్కా నములుతూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తోందని,  తరచూ మద్యం కూడా తీసుకుంటోందని చెప్పాడు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. భార్య ప్రవర్తన క్రూరత్వంగా ఉందని తేల్చింది. ఇలాంటి సందర్భాల్లో భర్తకు విడాకులు మంజూరు చేయడం సమంజసమని పేర్కొంటూ విడాకులు ఇచ్చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News