బాబును కాక్ టైల్ పార్టీకి ర‌మ్మ‌న్న బిలియ‌నీర్‌

Update: 2017-11-18 10:13 GMT
సీరియ‌స్ గా ఉండ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అల‌వాటు.  నిత్యం ప‌ని మీద మాత్ర‌మే మాట్లాడే చంద్ర‌బాబు చాలా విష‌యాల్ని అస్స‌లు ప్ర‌స్తావించ‌రు. క‌రుడుగ‌ట్టిన వ్యాపారి ల‌క్ష‌ణం ఆయ‌న‌లో క‌నిపిస్తుంది. తానున్న రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో రాజ‌కీయం త‌ప్పించి మ‌రే విష‌యాల్ని ఆయ‌న ప్ర‌స్తావించ‌రు. నిజానికి బాబులో ఎంతోకొంత మార్పుకు కార‌ణం దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అని చెప్పాలి.

విపక్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబును ఉద్దేశించి నాడు సీఎంగా ఉన్న వైఎస్ ప‌దునైన విమ‌ర్శ‌లు చేసేవారు.  బాబు సీరియ‌స్ గా ఉండ‌టం గురించి.. న‌వ్వు అన్న‌దే ముఖం మీద రాద‌న్న ఎగ‌తాళి మాట‌ల‌తో స‌హా ఆయ‌న చాలానే వ్యాఖ్య‌లు చేసేవారు. కాల‌క్ర‌మంలో ఆ మాట‌లు బాబు మీద ప్ర‌భావాన్ని చూపించ‌ట‌మే కాదు.. ఆయ‌న‌లో పెనుమార్పుకు కార‌ణమ‌య్యాయ‌ని చెప్పాలి.

ఇప్పుడు చంద్ర‌బాబు అప్పుడ‌ప్పుడ‌న్నా జోకులు వేయ‌టం క‌నిపిస్తుంది. ఇదే బాబు.. గ‌తంలో మాట వ‌ర‌స‌కు కూడా జోకులు వేసేవారు కాదు. అధికారుల‌తో ప‌ని చేయించుకునే విష‌యంలోనూ క‌ర్క‌సంగా ఉండేవారు. త‌ప్పు చేస్తే అంతే సంగ‌తులు అన్న‌ట్లుగా ఉండేవారే త‌ప్పించి.. చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట బాబు ద‌గ్గ‌ర ఉండేది కాదు.

ప‌దేళ్ల పాటుప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబును కాలం చాలానే మార్చింది. ఈ కార‌ణంగానే బాబు నోటి నుంచి అప్పుడ‌ప్పుడు ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేస్తున్నాయి.

ప్ర‌పంచ కుబేరుడు.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ విశాఖ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అగ్రిటెక్ 2017 ముగింపులో భాగంగా హాజ‌రైన గేట్స్ ను ఉద్దేశించి బాబు ప్ర‌సంగించారు. ఆయ‌న‌కు సంబంధించిన చాలా విష‌యాలు చెప్పుకొచ్చారు. గేట్స్ తో త‌న‌కున్న అనుబంధాన్ని వివ‌రించిన బాబు.. ఆయ‌నెంత ఉదాత్త‌వేత్త‌న్న విష‌యాన్ని చెప్పారు. గేట్స్ లోని ప్ర‌తి కోణాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నంలో కొన్ని  అంశాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌ని చెప్పాలి.

విశాఖ‌లో గేట్స్‌ కు స్వాగ‌తం ప‌ల‌క‌టం త‌న‌కు ఆనందంగా ఉంద‌న్న బాబు.. తొలిసారి తాను ఢిల్లీలో బిల్ గేట్స్ ను క‌లిసిన‌ప్పుడు ప‌ది నిమిషాలు మాత్ర‌మే టైమిచ్చార‌న్నారు.

తానిచ్చిన ప్ర‌జంటేష‌న్ ను మెచ్చి 40 నిమిషాల స‌మ‌యం ఇచ్చార‌న్నారు. బిల్ గేట్స్ త‌న సంపాద‌న‌లో ఎక్కువ భాగం స‌మాజం కోసం ఖ‌ర్చు చేస్తున్నార‌ని.. త‌న సంపాద‌న‌ను వార‌సుల‌కు ఇచ్చింది త‌క్కువేన‌న్నారు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం స‌మాజం కోసం ఖ‌ర్చు చేయ‌టం చాలా అరుద‌న్నారు. ఈ విష‌యంలో గేట్స్‌కు మించిన వారు మ‌రొక‌రు లేర‌న్నారు.

ఇర‌వైఏళ్ల క్రితం  అమెరికాలో కాక్ టైల్ పార్టీలో త‌న‌ను క‌ల‌వాల‌ని బిల్ గేట్స్ చెప్పార‌ని.. అయితే ఆ క‌ల‌యిక రాజ‌కీయంగా ఇబ్బంది ఉంటుంద‌ని తాను వెన‌క‌డుగు వేసిన విష‌యాన్ని చెప్పారు. తాను నో చెప్ప‌టంతో బిల్ గేట్స్ త‌న‌తో విడిగా స‌మావేశ‌మ‌య్యార‌ని చెప్పారు. బిల్ గేట్స్ గొప్ప‌త‌నం గురించి చెబుతూ.. త‌న నిబ‌ద్ధ‌త గురించి చెప్ప‌క‌నే చెప్పేసుకున్న బాబు తెలివిని గమ‌నించారా?
Tags:    

Similar News