గేట్స్ మాట‌!... రైతుల‌పైనే ఏపీ భ‌విష్య‌త్తు!

Update: 2017-11-17 13:06 GMT
ప్ర‌పంచ కుబేరుడిగా నీరాజనాలు అందుకుంటున్న మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్‌... శాస్త్ర సాంకేతిక‌త‌ను వినియోగించుకోవ‌డంలో అగ్ర‌గ‌ణ్యుడ‌ని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ క్వాలిటీ కార‌ణంగానే ఆయ‌న త‌న సంస్థ‌ను టెక్నాల‌జీ రంగంలో మేటి సంస్థ‌గా తీర్చిదిద్దారు. అంతేనా... తాను స్థాపించిన సంస్థ‌ను నాన్ స్టాప్‌ గా లాభాల బాట‌లో న‌డిపించిన గేట్స్‌... ప్ర‌పంచంలోనే అప‌ర కుబేరుడిగా ఎదిగారు. సంస్థ రోజువారీ కార్య‌క‌లాపాల నుంచి త‌ప్పుకుని ఇప్ప‌టికే చాలా ఏళ్ల‌యినా... ఇప్ప‌టికి కూడా ఆయ‌నే ప్ర‌పంచ కుబేరుల్లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నారు.  అయినా ఇప్పుడు బిల్ గేట్స్ ప్ర‌స్తావ‌న ఎందుకొచ్చిందంటే... న‌వ్యాంధ్ర‌కు చెందిన సాగ‌ర న‌గ‌రం విశాఖ‌ప‌ట్ట‌ణంలో గ‌డ‌చిన మూడు రోజులుగా చంద్ర‌బాబు స‌ర్కారు అగ్రి టెక్-2017 పేరిట ఓ భారీ స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది. ఈ సద‌స్సు ప్రారంభం సంద‌ర్భంగా ఉప‌రాష్ట్రప‌తి హోదాలో వెంక‌య్య‌నాయుడు హాజ‌రైతే... నేడు జ‌రిగిన ముగింపు స‌భ‌కు బిల్ గేట్స్ హాజ‌ర‌య్యారు.

అయినా టెక్నాల‌జీలో దిగ్గ‌జంగా ఎదిగిన బిల్ గేట్స్‌ ను సాగు స‌ద‌స్సుకు ఎందుకు పిలిచార‌న్న విష‌యానికి వ‌స్తే... మైక్రోసాఫ్ట్ కార్య‌క‌లాపాల నుంచి త‌ప్పుకున్న గేట్స్‌... మిలిండా గేట్స్ ఫౌండేష‌న్ ఏర్పాటు చేసి సేవా కార్య‌క్ర‌మాల‌కు తెర లేపారు. త‌న సంప‌ద‌లో మెజారిటీ వాటాను ఫౌండేష‌న్‌ కు కేటాయించిన గేట్స్‌... ఆ సేవ‌ల‌ను ఒక్క అమెరికాకే కాకుండా ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కూ విస్త‌రించారు. ఈ క్ర‌మంలో సాగుపైనా గేట్స్ ఫౌండేష‌న్ చాలా క‌స‌రత్తే చేస్తోంది. ఆఫ్రికా ఖండంలోని ప‌లు దేశాల్లో ఈ సేవ‌లు మ‌రింత విస్తృతంగా కొన‌సాగుతున్నాయి. ఇక తెలుగు నాట కూడా చాలా కాలం క్రిత‌మే ఎంట్రీ ఇచ్చిన ఈ ఫౌండేష‌న్‌... ఇప్పుడు న‌వ్యాంధ్ర రైతుల‌కు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని చేరువ చేసే బృహ‌త్కార్యానికి సంక‌ల్పించింది. ఈ క్ర‌మంలోనే సాగుపై భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్న ఈ స‌ద‌స్సుకు బాబు సర్కారు బిల్ గేట్స్‌ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన గేట్స్ నేటి అగ్రి టెక్ ముగింపు స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ఏపీ భ‌విష్య‌త్తు మొత్తం రైతుల‌పైనే ఆధార‌ప‌డి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. వ్య‌వ‌సాయ రంగంలో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు రావడం సంతోషంగా ఉంద‌ని, వ్య‌వ‌సాయాన్ని వ్యాపారంగా చేసినప్పుడే వృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఇందుకోసం వ్య‌వ‌సాయ రంగంలోకి మ‌రింత సాంకేతిక రావాల్సిందేన‌న్నారు. ఒక్క ఏపీలోనే కాకుండా... మొత్తం భార‌త దేశంలో చిన్న‌ - స‌న్న‌కారు రైతులే ఎక్కువ‌గా ఉన్నార‌ని, వారికి ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందాలంటే ప్ర‌భుత్వాలు త‌మ వంతు కృషి చేయాల్సి ఉంద‌న్నారు. టెక్నాల‌జీతో పాటు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను కూడా ప్ర‌భుత్వాలు రైతుల ద‌రికి చేర్చాల‌న్నారు. రైతుల‌కు సాంకేతిక‌త‌ను అందించే విష‌యంలో ఏపీ ముందుకు వ‌చ్చింద‌ని... సాగులో ఉత్పాద‌క‌త పెంపు - మార్కెట్ అనుసంధానంపై ఏపీతో క‌లిసి ప‌నిచేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. త‌మ కృషి వ‌ల్ల‌ ఇండోనేసియాలో శాస్త్రవేత్తల పరిశోధనలు రైతులకు చేరువయ్యాయన్నారు. భారత్‌లోనూ సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు రైతులకు చేరువ కావాల్సి ఉంద‌న్నారు.

వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపునకు మరిన్ని పరిశోధనలు జరగాలని... పశుగణాభివృద్ధి, డెయిరీ రంగంలోనూ సాంకేతికత వినియోగం అవసరమ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మెగా సీడ్‌ పార్కుల వల్ల చాలా ప్రయోజనాలున్నాయని, విత్తన ఉత్పత్తికి ఏపీ కేంద్రంగా మారబోతోందన్నారు. రైతులకు భూసార పరీక్ష పత్రాలు త్వరగా చేరాల్సి ఉంద‌న్నారు. ఆఫ్రికాలో ఉపగ్రహ చిత్రాల ద్వారా రైతులకు భూసార పరీక్ష పత్రాలు ఇస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల సమాచారం చిన్న రైతులకు సరిగా అందట్లేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చిన్న - సన్నకారు రైతుల నుంచి వ్యాపారులు నేరుగా పంటను కొనుగోలు చేయాలని, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. వ్యవసాయరంగంలో సాంకేతికత వినియోగం రెట్టింపు కావాల్సి ఉంద‌ని గేట్స్ అభిప్రాయ‌ప‌డ్డారు.
Tags:    

Similar News