గాంధీలో కరోనా పేషేంట్స్ కి 'బిర్యానీ' - 'స్పైసీ ఫుడ్' కావాలట !

Update: 2020-04-04 17:00 GMT
కరోనా వైరస్ ..తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా పెరిగిపోతుంది. కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. తెలంగాణలో కరోనా సోకిన రోగులకు గాంధీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఫీవర్ - చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నా కూడా  గాంధీలోనే ఎక్కువగా కరోనా రోగులు ఉన్నారు. ఇక్కడ మిగతా ఓపీ - ఆపరేషన్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా భాదితుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేసి ..వారికీ చికిత్స అందిస్తున్నారు. వారిని ప్రతీ క్షణం పరిశీలిస్తూ.. సరైన భోజనం, టాబ్లెట్స్ ఇస్తున్నారు.

కానీ, కొందరు మాత్రం ఆసుపత్రిలో అందజేసే భోజనంపై పెదవి విరుస్తున్నారు. తమకు బిర్యానీ - స్పైసీ ఫుడ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. రోగుల కోరికలను చూసి.. వైద్యులు నోరెళ్లబెడుతున్నారు. ఇక తమ వల్ల కాదు బాబోయ్ అంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రతినిధులకు తమ ఇబ్బందులను తెలియజేశారు. కరోనా రోగుల డిమాండ్లపై వారికి చికిత్స చేసే జూనియర్ డాక్టర్లు రెండు విధాలుగా స్పందించడం విశేషం. ఐసోలేషన్ వార్డలు రద్దీగా ఉంటాయని.. రోగులు కోరిన కోరికలు తీర్చలేమని తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోయేషన్ గాంధీ ఆస్పత్రి ప్రెసిడెంట్ తెలుపగా.. రోగులకు సరైన ప్రొటీన్ ఆహారం అందించడం లేదని ఇతర జూడాలు ఆరోపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వాస్తవానికి గాంధీ ఆస్పత్రి లో డైటిషీయన్ లేరు. దీంతో ఏ రోగులకు ఏ ఆహారం అందించాలనే అంశంపై ఆస్పత్రి నిబంధనలు పాటించడం లేదు. సాధారణ రోగుల మాదిరిగానే కరోనా వైరస్ సోకిన వారికి ఆహారం అందిస్తున్నారు. వారికి హై ప్రొటిన్ ఆహారం మాత్రమే ఇస్తున్నారు. ఇందులో నాన్ వెజ్ లేకపోవడంతో రోగులు.. కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. పండ్లు తినడం వల్ల రోగులకు నిరోధక శక్తి వస్తుందని, దీంతో త్వరగా కోలుకోవడానికి వీలవుతోందని వైద్యులు చెప్తున్నా కూడా  పట్టించుకోవడం లేదు. వైద్యుల మాటను రోగులు లెక్కచేయడం లేదు.

మరికొందరేమో తమకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు అని ఆరోపిస్తున్నారు. మంచి ఆహారం ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. తాము అనారోగ్యానికి గురికాలేదని, జ్వరం కూడా లేదు అని.. ఎందుకు మంచి ఆహారం ఇవ్వడం లేదు అని మరో రోగి ప్రశ్నిస్తున్నారు. మంచి ఆహారం పెట్టండి లేదంటే.. మేం వెళ్లిపోతాం అని కూడా బెదిరిస్తున్నారని గాంధీ వైద్యుడు ఒకరు వాపోయారు. రోగుల డిమాండ్లను తీర్చలేక.. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని చెప్పారు.
Tags:    

Similar News