రోజులో బిట్ కాయిన్ విలువ అంత పెరిగింది

Update: 2017-12-08 04:50 GMT
ఒక రూపం లేకుండా.. ఏ దేశానికి చెంద‌ని.. మ‌రే సెంట్ర‌ల్ బ్యాంకూ నియంత్రించ‌టం చేయ‌ని ఒక క‌రెన్సీ ప్ర‌పంచ మార్కెట్ల‌ను షేక్ చేస్తోంది. కంటికి క‌నిపించ‌కుండానే ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు విలువ చేసే బిట్ కాయిన్ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గ‌తంలో ప‌లుమార్లు దీని గురించి చ‌ర్చ జ‌రిగినా.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా మీడియాలో ప్ర‌ముఖంగా ప్ర‌చురిత‌మైంది. ఎందుకిలా?  తాజాగా ఏం జ‌రిగిందన్న తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

భౌతిక‌రూపమంటూ లేని బిట్ కాయిన్  కరెన్సీ ఇప్పుడు మాంచి జోరు మీద ఉంది. ఒకే ఒక్క‌రోజులో ఒక బిట్ కాయిన్ విలువ ఏకంగా రూ.3ల‌క్ష‌ల‌కు పెరిగి రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో మ‌రే దేశ క‌రెన్సీకి లేనంత డిమాండ్‌.. ఏ వ‌స్తువుకు ద‌క్క‌నంత విలువ బిట్ కాయిన్‌కు ద‌క్కుతోంది.  అంత‌కంత‌కూ పెరిగిపోతున్న ఈ బిట్ కాయిన్ విలువ నిజంగానే పెరుగుతుందా?  ఇదంతా కృత్రిమ‌మా? అన్న ప్ర‌శ్న‌కు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.

ఈ బిట్ కాయిన్ కాన్సెప్ట్‌ ను తెర మీద‌కు తెచ్చిన‌ప్పుడు ఒక బిట్ కాయిన్ విలువ సెంట్ కంటే త‌క్కువ‌. త‌ర్వాతి కాలంలో ఇది కాస్తా ఒక డాల‌ర్ కు స‌మాన‌మైంది.  

అలా మొద‌లైన బిట్ కాయిన్ వృద్ధి.. ఈ ఏడాది ఆరంభంలో రూ.50వేల నుంచి రూ60వేల వ‌ర‌కు వెళ్లింది.  ప్ర‌స్తుతం దాని విలువ రూ.10ల‌క్ష‌ల రూపాయిలు. నిన్న (బుధ‌వారం) ఒక్క‌రోజులో బిట్ కాయిన్ విలువ ఏకంగా రూ.3ల‌క్ష‌లు పెరిగింది. అంటే.. రూ.13ల‌క్ష‌లన్న మాట‌. అంటే.. ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కూ బిట్ కాయిన్ విలువ 1500 శాతం పెరిగిన‌ట్లన్న మాట‌.

గురువారం ఒక్క‌రోజులో ఇంత భారీగా పెర‌గ‌టానికి కార‌ణాల్ని చూస్తే.. షికాగో మ‌ర్కంటైల్ ఎక్సేంజీ.. నాస్ డాక్ బిట్ కాయిన్ కు ఫ్యూచ‌ర్ ట్రేడింగ్‌ ను ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించ‌టం.. హెడ్జ్ ఫండ్స్ అసెట్ మేనేజ‌ర్స్ లాంటి సంప్ర‌దాయ మ‌దుప‌ర్ల నుంచి ఆద‌ర‌ణ పెరుగుతుండ‌టం..  బిట్ కాయిన్ ద్వారా చెల్లింపుల‌కు వీలు క‌ల్పిస్తున్న ఆన్ లైన్‌.. ఆఫ్ లైన్ విక్ర‌య కేంద్రాలు అంత‌కంత‌కూ పెర‌గ‌టం లాంటి వాటితో వీటి డిమాండ్ భారీగా పెరుగుతోంది. అలా అని వీటి మీద తొంద‌ర‌ప‌డి మోజు ప‌డి.. మ‌దుపు చేస్తే ఏమైనా జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  త‌స్మాత్‌.. జాగ్ర‌త్త‌.
Tags:    

Similar News