ఐల‌య్య‌పై మ‌ళ్లీ దాడి జ‌రిగిందే!

Update: 2017-11-22 09:32 GMT
ప్రొఫెస‌ర్‌, సంచ‌ల‌న ర‌చ‌యిత కంచ ఐల‌య్యపై మ‌రోసారి భౌతిక దాడికి కొంద‌రు ప్రయ‌త్నించారు. అయితే, తృటిలో ఆయ‌న త‌ప్పించుకోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్ట‌యింది. విష‌యంలోకి వెళ్తే.. సంచ‌ల‌న ర‌చ‌న‌ల‌తో వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారారు ప్రొఫెస‌ర్ ఐల‌య్య షెఫ‌ర్డ్‌. ముఖ్యంగా స‌మాజంలోని అగ్ర‌వ‌ర్ణాల‌ను విమ‌ర్శించ‌డం ఆయ‌న‌కు పెన్నుతో పెట్టిన విద్య‌. తాను రెండో అంబేద్క‌ర్ న‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించుకున్న ఈ ఆచార్యుడు. ద‌ళితులు - ఆదివాసీల ప‌ట్ల ఉన్న ప్రేమ‌ను అగ్ర‌వ‌ర్ణాల‌పై విషంగా మార్చి చేస్తున్న ప్ర‌యోగాలు విక‌టిస్తున్నాయి.

భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌తో ఆయ‌న రాసిన‌ - సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు పుస్త‌కం పెను సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఏపీ - తెలంగాణ‌ల్లో కోమ‌ట్లు - బ్రాహ్మ‌లు - మ‌ఠాధిప‌తులు సైతం రోడ్ల మీద‌కు వ‌చ్చి ఐల‌య్య‌ను ఏకిపారేశారు. అంతేకాదు, ఐల‌య్య అరెస్టుకు సైతం డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఒక సారి ఐల‌య్య‌పై తెలంగాణ ప్రాంతంలో దాడి కూడా జ‌రిగింది. ఇక‌ - వైశ్య సామాజిక వ‌ర్గం ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఐల‌య్య‌ - వారంతా క‌లిసి ఐల‌య్య‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే ఐల‌య్య‌పై గ‌త సెప్టెంబ‌రు 24న తెలంగాణ‌లోని ప‌ర‌కాల‌లో ఆర్య‌వైశ్యులు దాడికి పాల్ప‌డ్డారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు అద్దాల‌ను కూడా రాళ్ల‌తో ధ్వంసం చేశారు. దీనిపై అప్ప‌ట్లోనే పోలీసులు కేసు న‌మోదు చేశారు. తాజాగా  బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టుకు హాజ‌రైన ఐల‌య్య‌పై  మ‌రోసారి దాడి జ‌రిగే ప్ర‌య‌త్నం చేశారు బీజేవైఎం కార్య‌క‌ర్త‌లు. నిజానికి సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తక రచనపై నమోదైన కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు కోరుట్ల వచ్చారు.

అంతకు ముందు జగిత్యాలలో ఆయన బస చేసిన లాడ్జి వద్ద బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హోటల్‌పై దాడి చేసేందుకు యత్నించారు. దీంతో హోటల్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. అనంతరం ఐలయ్య పోలీసుల రక్షణలో కోరుట్ల వెళ్లారు. అయితే, బీజేవైఎం కార్య‌క‌ర్త‌లు త‌న‌ను వెంబ‌డించార‌ని, త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఐల‌య్య పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ కేసు ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి ఐల‌య్య ర‌చ‌న‌లు తేనెతుట్టెల‌ను త‌ల‌పిస్తున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.
Tags:    

Similar News