కేంద్ర మంత్రి ఉత్సాహం : టీడీపీతో బీజేపీ జట్టు...?

Update: 2022-07-16 09:13 GMT
మెల్లగా పసుపు పార్టీకి మంచి రోజులు వస్తున్నట్లే కనిపిస్తున్నాయి. ఈ మధ్యనే జనాల మూడ్ మారుతోంది. చంద్రబాబు సభలకు జనాలు వెల్లువలా వస్తున్నారు. ఇక వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత  నెమ్మదిగా పెరుగుతోంది. టీడీపీలో నేతలు కూడా యాక్టివ్ అవుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లో కూడా పసుపు కళ కడుతోంది.

దానికి తోడు అన్నట్లుగా మూడేళ్ళుగా ముడుచుకుని కూర్చున్న బీజేపీ కూడా ఇపుడు టీడీపీతో చెట్టాపట్టాల్ వేయడానికి సుముఖంగా ఉన్నట్లుగా ఢిల్లీ వార్తలు సూచిస్తున్నాయి. ఈ మధ్యన ఏపీకి వచ్చిన బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా టీడీపీ వారు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళి మరీ థాంక్స్ చెప్పి వచ్చారు.

టీడీపీకి సంఖ్యా బలం తక్కువగా ఉన్న విశేషమైన ప్రాధాన్యత ఇవ్వడం వెనక బీజేపీ కేంద్ర పెద్దలు ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే కచ్చితంగా టీడీపీ మద్దతు తీసుకోవాలని, వారిని కూడా కలవాలని తమ పార్టీ వారికి చెప్పి పంపించారుట. అంటే మోడీ అమిత్ షాలు ఇద్దరూ టీడీపీ మీద కోపం గా ఉన్నారని, వారు చంద్రబాబుని దరికి చేరనీయడంలేదని ఇప్పటిదాకా జరుగుతున్న ప్రచారం తప్పు అని  దీనిని బట్టి తేలిపోయింది అంటున్నారు.

వచ్చే ఎన్నికలలో నార్త్ కంటే సౌత్ మీదనే బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. తెలంగాణాలో పాగా వేయాలని చూస్తోంది. దాని కోసం అక్కడ మొదటి నుంచి బలంగా ఉన్న టీడీపీని కూడా కలుపుకుని పోతారని అంటున్నారు. అది పొత్తుల ద్వారానా లేక మరో విషయానా అన్నది తెలియడంలేదు. ఇక ఏపీలో చూస్తే వైసీపీనే నమ్ముకుని రాజకీయం చేయడం శ్రేయస్కరం కాదని కమలనాధులు భావిస్తున్నారు అన్నది లేటెస్ట్ టాక్.

వైసీపీకి గ్రాఫ్ అయితే తగ్గుతోంది. ఒకవేళ తాము అనుకున్నట్లుగా నంబర్ వైసీపీకి ఏపీలో రాకపోయినా ఆ ప్లేస్ లో టీడీపీ పుంజుకున్నా తమకు ఇబ్బంది అని బీజేపీ దూరాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే తమ జట్టు కోసం ఆరాటపడుతున్న టీడీపీని దగ్గరకు తీయడంతో తప్పు లేదని కూడా కేంద్ర పెద్దల ఆలోచన అని చెబుతున్నారు. ఇక టీడీపీ వల్ల గతంలో లబ్ది పొంది ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఒకాయన అయితే ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అని అధినాయకత్వానికి చెప్పి ఉంచారని అంటున్నారు.

ఈ ఏడాది చివరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ హై కమాండ్ దాని మీదనే దృష్టి పెట్టింది. ఆ ఎన్నికలు ముగియగానే ఏపీ మీద తమ మాస్టర్ ప్లాన్ ఏంటి అన్నది కచ్చితంగా బయటపెడుతుంది అని అంటున్నారు. ఈ రోజున ఢిల్లీలో మారుతున్న రాజకీయ పరిణామాలు, చోటు చేసుకుంటున్న అనేక కీలకమైన పరిస్థితులను కనుక గమనంలోకి తీసుకుంటే ఏపీలో బీజేపీ టీడీపీల మధ్య పొత్తు కచ్చితంగా కుదురుతుంది అని అంటున్నారు. అలాగే జనసేనతో  కలిపి వైసీపీకి యాంటీగానే బరిలోకి దిగుతారు అని అంటున్నారు.
Tags:    

Similar News