పొత్తు పొడిచేనా : అక్కడ బీజేపీ టీడీపీ కరచాలనం

Update: 2022-06-15 17:30 GMT
ఏపీలో రాజకీయాలు పొత్తులు ఎత్తుల గురించి పెద్ద చర్చ సాగుతూనే ఉంది. ఎవరు ఎవరితో కలుస్తారు అన్నది ఇంకా తేలకపోయినా అంతా కలసి రావాలని టీడీపీ అయితే చాలా గట్టిగానే  కోరుకుంటోంది. ఇక మేము మా జనసేన మాత్రమే పొత్తులలో ఉన్నది  అని సోము వీర్రాజు ఇప్పటికి ఒకటికి పది సార్లు  చెప్పుకొచ్చారు. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని ఈ మధ్యనే  భారీ శపధం చేశారు. వీటన్నిటి వెనకా ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే 2024 ఎన్నికల్లఒ 2014 పొత్తులు రిపీట్ కావడమే. అంటే టీడీపీ బీజేపీ జనసేన కలసి పోటీ చేయడం అన్న మాట.

అది జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే తెల్లారిలేస్తే టీడీపీ నేతల మీద అంతెత్తున ఎగిరే బీజేపీ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు ఏకంగా టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడుతో తాజాగా  కరచాలనం చేశారు. ఇది అనూహ్యంగా జరిగిన సంఘటనగా చూడాలి.  విషయానికి వస్తే సిక్కోలు జిల్లా  టెక్కలిలో ఏపీ బీజేపీ అధినేత  సోము వీర్రాజు పర్యటిస్తున్నారు.

అక్కడ కాపు తెంబూరు గ్రామంలో ఉన్న గ్రామ దేవత బొంగు పోలమ్మ అమ్మవారి దర్శనానికి సోము వీర్రాజు రావడం అదే సమయంలో అచ్చెన్నాయుడు కూడా అక్కడకు రావడంతో ఇద్దరు నాయకులూ పరస్పరం పలకరించుకున్నారు. ఆప్యాయంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు

ఈ సన్నివేశం స్థానిక బీజేపీ టీడీపీ శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. ఇక అంతకు ముందే ఒక కార్యక్రమంలో సోము వీర్రాజు మాట్లాడుతూ టెక్కలిలో మైనింగ్ గనులను అటు అధికార పార్టీతో పాటు ఇటు ప్రతిపక్ష అచ్చెన్నాయుడు కూడా కలిపి దోచేస్తున్నారు అని భారీ ఆరోపణ చేశారు. ఆ వెంటనే ఈ కరచాలనం జరిగింది.

మొత్తానికి గమ్మత్తుగా జరిగిన ఈ భేటీ రెండు పార్టీలలో కొత్త చర్చకు తెర లేపుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గట్టెక్కుతామన్న ఆశ బీజేపీ దిగువ స్థాయి నాయకులలోనూ  ఉంది. అయితే దాని మీద హై కమాండ్ వైఖరి వేరే విధంగా ఉండడంతో ఇంతకాలం గమ్మున ఉన్నారు.

ఇపుడు చూస్తే ఈ కరచాలనం రేపటి పొత్తుల రాజకీయానికి కీలకం అవుతుందా అన్న మాట అయితే అటూ ఇటూ కూడా  ఉంది. అటు అచ్చెన్న ఇటు సోము ఇద్దరూ ఫైర్ బ్రాండ్లే. ఈ ఇద్దరు కలయిక మాత్రం ఇపుడు రాజకీయంగా మంట పుట్టించేలాగానే ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News