కన్నా సంచలనం... బాబు మాదిరే జగన్ కూ ఓటమి తప్పదట

Update: 2020-01-21 07:38 GMT
ఏపీలో రాజకీయ వేడి బాగానే రాజుకుంది. ఏపీకి మూడు రాజధానులంటూ జగన్ సర్కారు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటన లో ఉన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటనలు చేశారు. ఏపీకి మూడు రాజధానుల దిశగా జగన్ సర్కారు వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన చర్యను పిచ్చి తుగ్లక్ చర్యగా కన్నా అభివర్ణించారు. మూడు రాజధానుల విషయాన్ని ఓ జాతీయ పార్టీ గా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కూడా కన్నా తేల్చి చెప్పేశారు. ఈ తరహా పిచ్చి తుగ్లక్ చర్యను ఖిండిస్తూ... తమ మిత్రపక్షం జనసేన తో కలిసి పోరు బాట పడతామని కన్నా చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా కన్నా మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో చంద్రబాబు పై కసితో ఉన్న ఏపీ ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పట్టారని చెప్పిన కన్నా... 2019లో జరిగిన తీరుగానే 2024 ఎన్నికల్లో జగన్ ప్రజల వ్యతిరేకతను చవిచూడక తప్పదని కూడా జోస్యం చెప్పారు. 2019లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో చంద్రబాబు ఓడిపోతే... అదే తరహా వ్యతిరేకతతో 2024లో జగన్ కూడా ఓడిపోక తప్పదని కూడా కన్నా చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకున్న జగన్... 2024లో అదే తరహా ప్రజా వ్యతిరేకత కారణంగా ఓడిపోతారని చెప్పారు.

అయినా ఇప్పుడు ఒక్కటి గా ఉన్న రాజధానిని మూడు రాజధానులుగా విడగొట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన కన్నా... విశాఖలో భూములను కొట్టేసేందుకే జగన్ ప్లాన్ వేశారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి వేదికగా టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని ఆరోపిస్తున్న జగన్... సదరు ఆరోపణలపై విచారణ చేసి తప్పుంటే టీడీపీ నేతలను శిక్షించవచ్చు కదా అని కన్నా జగన్ సర్కారును నిలదీశారు. అమరావతి కేంద్రంగా టీడీపీకి దోపిడీకి పాల్పడితే... విశాఖ కేంద్రంగా వైసీపీ దోపిడీకి తెర తీయబోతోందని కన్నా ఆరోపించారు. మొత్తంగా ఇటు టీడీపీ, అటు వైసీపీ దోపిడీల పై తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన కన్నా.. 2024 ఎన్నికల్లో జగన్ ఓడి పోక తప్పదని జోస్యం చెప్పడం విశేషం.


Tags:    

Similar News