మ‌హారాష్ట్ర ప‌రిణామాలు, బీజేపీ అతిపెద్ద ఓట‌మి

Update: 2019-11-04 06:12 GMT
బీజేపీ, శివసేన అధికారం పంచుకునే విషయంలో  పట్టు వీడకపోవడంతో, మ‌హారాష్ట్రలో సరికొత్త రాజకీయ పొత్తులకు తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌-ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నేడు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ కానున్న నేపథ్యంలో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌కు శివసేన నేత సంజయ్‌ రౌత్‌ సందేశం పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం ఫడ్నవీస్‌ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి పయనమవ‌డం బీజేపీలో క‌ల‌వ‌ర‌పాటును స్ప‌ష్టం చేస్తోంది.


శివసేన నేత సంజయ్‌రౌత్ త‌మ పార్టీ గ‌లాన్ని బ‌లంగా వినిపిస్తున్నారు.  కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఆపరేషన్‌ కమలం చేపట్టినట్లు యెడియూరప్ప స్వయంగా పేర్కొన్న ఆడియో బయటకు వచ్చిన నేపథ్యంలో వాటిని ఉటంకిస్తూ...యెడియూరప్ప తరహా రాజకీయాలు మహారాష్ట్రలో చెల్లుబాటు కాబోవని తేల్చిచెప్పారు. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని, ఆ సంఖ్య 175కు కూడా పెరుగొచ్చని పేర్కొన్నారు. బీజేపీతో చర్చలంటూ జరిగితే ముఖ్యమంత్రి పదవిపైనేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వంలోని గూండాలు గత 10 రోజులుగా తమపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే వాటికి తాము తలొగ్గేది లేదన్నారు. శివసేన పత్రిక సామ్నాలోనూ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్ఠంభన.. ‘అహంకారం అనే బురదలో రథం చిక్కుకున్నట్లుగా’ ఉందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది బీజేపీకి ‘శతాబ్దపు అతిపెద్ద ఓటమి’గా నిలుస్తుందని హెచ్చరించారు.

మ‌రోవైపు, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఐదు మార్గాలున్నాయని సంజ‌య్ రౌత్‌ పేర్కొన్నారు. ఆయ‌న విశ్లేష‌ణ ఇలా సాగింది.
1.బీజేపీ-శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం. అయితే ముఖ్యమంత్రి పదవిని మాత్రం పంచుకోవాల్సిందే. ఇదే అన్నింటికంటే ఉత్తమమైన మార్గం అయినప్పటికీ, అహంకారం కారణంగా ఇది సాధ్యం కాకపోవచ్చు.
2. శివసేన లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. కానీ ఆ పార్టీకి ఇంకా 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబట్టి, బలపరీక్షలో నెగ్గకపోవచ్చు.
3. ఎన్‌సీపీ నేత‌ సుప్రియా సూలేకి కేంద్రంలో, ఆ పార్టీ ముఖ్య‌నేత అజిత్‌ పవార్‌కు రాష్ట్రంలో పదవుల హామీతో 2014లో మాదిరిగా బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఇవ్వొచ్చు. అయితే 2014లో చేసిన తప్పును శరద్‌ పవార్‌ మళ్లీ చేస్తారనుకోవడం లేదు.
4. దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ఇతర పార్టీలను చీల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. ఫిరాయింపుదారుల్ని ఓటర్లు ఏ విధంగా ఓడించారో చూసిన తర్వాత ఇది కష్టసాధ్యమే.
5. ఎన్సీపీ-కాంగ్రెస్‌లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం. శివసేన ముఖ్యమంత్రి పదవిని చేపడుతుంది. అని విశ్లేషించి...ఎన్‌సీపీకి ఆప్ష‌న్ లేకుండా చేశారు.
Tags:    

Similar News