‘మహా’ గిఫ్ట్: శరద్ పవార్ కు బీజేపీ బంపర్ ఆఫర్

Update: 2019-11-23 11:13 GMT
మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య ఈ ఉదయం బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వం కొలువుదీరింది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పార్టీలు తేరుకునే లోపే ప్రభుత్వం ఏర్పడింది. దీంతో శివసేన సీఎం పదవి ఆశలు కల్లలయ్యాయి. బీజేపీ కొట్టిన ఈ దెబ్బకు శివసేన బిత్తరపోయింది. కాగా బీజేపీ గేమ్ ప్లాన్ లో ప్రధానంగా ఉపయోగపడింది ఎన్సీపీనే.  ఆ పార్టీ నేత అజిత్ పవార్ సాయంతో మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారును బీజేపీ ఏర్పాటు చేసింది.

అయితే అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు వ్యతిరేకంగా బీజేపీతో జతకట్టడం ఆపార్టీలో చిచ్చు రేపింది. అయితే కేంద్రంలోని బీజేపీ మాత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మహారాష్ట్రలో కలిసిపోయామని.. కేంద్రంలోనూ కలవాలని పిలుపునిచ్చారు.

తాజాగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే శనివారం సంచలన ఆఫర్ ను శరద్ పవార్ కు ఇచ్చారు. శరద్ పవార్, ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేలను నరేంద్రమోడీ మంత్రివర్గంలో చేరాలని సూచించారు. దేశంలో బీజేపీని బలోపేతం చేయడానికి శరద్ పవార్ సహకరించి కేబినెట్ లో చేరాలని కోరారు.

కాగా ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గాన్ని చీల్చి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్టీ, కుటుంబం విడిపోయిందంటూ’ ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News