బీజేపీ చేతుల్లో పురంధేశ్వరి రిటైర్మెంట్...?

Update: 2023-01-17 02:30 GMT
ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ రాజకీయాలు నాకు వద్దు అని రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఆయన వరకూ ఓకే అనుకున్నా కుమారుడు హితేష్ ని సైతం రాజకీయాల్లోకి దించబోను అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎన్టీయార్  రాజకీయాల్లోకి వచ్చినపుడు ఆయన వెన్నంటి ఉన్న వారు దగ్గుబాటి. ఆయన తండ్రి గారు చెంచురామయ్యకు రాజకీయాల్లో కొంత ప్రవేశం ఉంది. అయితే ఆయన కీలక పదవులు చేపట్టలేదు కానీ కాంగ్రెస్ లో ప్రకాశం జిల్లాకు సంబంధించి నాయకుడిగా ఉండేవారు.

ఇక డాక్టర్ గా ఉన్న వెంకటేశ్వరరావుకు రాజకీయాల మీద అసలు ఆసక్తి లేదు. కానీ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు కుటుంబం నుంచి ఆయన వచ్చి అండగా నిలిచారు. ఆ సమయంలో చిన్నల్లుడు చంద్రబాబు కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నారు. మొదట ఎన్టీయార్ చంద్రబాబు మీదనే ఆధారపడాలనుకున్నారు కానీ ఆయన మామ రాజకీయం మీద నమ్మకం లేక రాలేను   చంద్రబాబు  అని చెప్పారని అప్పట్లో చెప్పేవారు.

ఇక 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేంతవరకూ పార్టీలోనూ ఆ మీదట ప్రభుత్వ వ్యవహారాల్లోనూ దగ్గుబాటి ఎంతో హెల్ప్ చేస్తూ వచ్చారు. ఆయన 1985లో తొలిసారి పర్చూరు నుంచి పోటీ చేసి గెలిచారు. వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో మరోసారి గెలిచారు. కానీ 1991లో ఆయన ఎంపీగా వెళ్లారు. ఇక 1995లో రాజకీయ సంక్షోభంలో ఆయన చంద్రబాబు వెంట నడిచారు. అలా ఆయన కొంత నష్టపోయారు. ఆ టైం లో  ఎన్టీయార్  వెంట నిలిచి ఉంటే బాగుండేది అనే వారు ఉన్నారు.

మొత్తానికి  ఎన్టీయార్  మరణం తరువాత దగ్గుబాటి రాజకీయ జీవితం మసకబారింది. 2004లో వైఎస్సార్ పిలుపుతో కాంగ్రెస్ ఓ చేరిన దగ్గుబాటి పర్చూరు నుంచి గెలిచారు. అలా 2009లోనూ గెలిచారు. ఈ మధ్యలో రాజ్యసభ మెంబర్ గా కూడా ఆరేళ్ల పాటు పనిచేశారు. మొత్తానికి మంత్రిగా ఎంపీగా ఆయన కీలకంగానే ఉన్నా వర్తమాన రాజకీయాల జోరు అందుకోలేక వెనక్కి వెళ్లారు. ఇక పర్చూరు లో ఆయన వర్గం ఉన్నా గెలిచేటంత సీన్ కనిపించడంలేదు అంటారు.

మరో వైపు చూస్తే తన భార్య,  ఎన్టీయార్  కుమార్తె పురంధేశ్వరి కోసమే దగ్గుబాటి రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించారు అని చెబుతారు. బీజేపీ ఏపీలో తెలుగుదేశంతో కలవడానికి ఇష్టపడడంలేదు దాంతో తన కుమారుడికి టీడీపీ టికెట్ ఇచ్చినా పురంధేశ్వరికి బీజేపీలో అవకాశాలు దక్కవని భావించే ఆయన ఇలా ప్రకటించారు అని అంటారు.  దాంతో దగ్గుబాటి ఫ్యామిలీలో ఇపుడు ఏకైక నాయకురాలిగా పురంధేశ్వరి ఉన్నారు.

ఆమె బీజేపీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేస్తారు. గెలుపు అవకాశాలు అయితే లేవు కానీ 2024లో మరోమారు మోడీ సర్కార్ ఏర్పడితే రాజ్యసభకు ఆమెను తీసుకుని కేంద్ర మంత్రిని చేస్తారు అన్న ఆశలు అయితే ఉన్నాయి. దాని మీదనే ఇపుడు ఆలోచనలు పెట్టుకుని దగ్గుబాటి రిటైర్మెంట్ అన్నారు అని చెబుతున్నారు. మరి పురంధేశ్వరి కూడా వర్తమాన  రాజకీయాల కొంత విరక్తిగా ఉన్నారు.

అయితే బీజేపీ జాతీయ నాయకత్వం ఆమె సేవలను గురించి అందలాలు ఎక్కిస్తే సరేసరి. లేకపోతే మాత్రం ఆమె రిటైర్మెంట్ ప్రకటనకు కూడా ఎంతో దూరం ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఏపీలో బీజేపీకి బలం లేకపోతే పురంధేశ్వరికి కేంద్ర మంత్రి ఎలా ఇస్తారు అన్న లెక్క కూడా వేస్తారు కదా అని అంటున్నారు. అయితే ఏపీలో 2024లో తెలుగుదేశం ఓడితే అపుడు రాజకీయ అవసరాల దృష్ట్యా  ఎన్టీయార్  తనయగా ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన మహిళా నేతగా పురంధేశ్వరిని బీజేపీ హై కమాండ్ ముందు వరసలోకి తెచ్చి ప్రాధాన్యం ఇస్తుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పెద్దల్లుడి కుటుంబంలో ఇపుడు చిన్నమ్మే పొలిటికల్ అట్రాక్షన్ గా  ఉన్నారన్న మాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News