త‌క్కువ టైంలో బీజేపీ సాధించిన గొప్ప రికార్డు!

Update: 2017-10-18 05:00 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న‌ భారతీయ జనతాపార్టీ(బీజేపీ) మ‌రో రికార్డు సాధించింది. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోనే అత్యధిక స‌భ్యులు క‌లిగి ఉన్న పార్టీగా త‌న ఖాతాలో రికార్డు న‌మోదుచేసుకున్న బీజేపీ....దేశంలోని ఏడు జాతీయ పార్టీల్లో అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి వెల్లడైన వివరాల ప్రకారం.. రూ.894కోట్ల ఆస్తులతో ఆ పార్టీ మొదటిస్థానాన్ని ఆక్రమించింది. రూ.759కోట్లతో కాంగ్రెస్ తర్వాత స్థానంలో నిలిచింది. అదే ఆర్థిక సంవత్సరానికి బీజేపీ రూ. 25కోట్ల ఖర్చుల్ని చూపగా - కాంగ్రెస్ రూ.329 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపింది. ఈ వివరాలతో అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది.

2004-05 నుంచి 2015-16 మధ్యకాలంలో పార్టీలు వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. పార్టీల స్థిర - చరాస్తులు - విరాళాలు - వాహనాలు - పెట్టుబడులు - డిపాజిట్లు - రుణాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన అంశం...2014-15 వరకు కాంగ్రెస్ బీజేపీకన్నా ఎక్కువ ఆస్తుల్ని కలిగి ఉండగా, 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండేండ్లలోనే కాంగ్రెస్‌ ను దాటేసింది. పార్టీ ఖర్చులు - ఇతరత్ర వ్యయాలను తీసేస్తే.. 2015-16లో రూ.869కోట్లతో బీజేపీ సంపన్న పార్టీగా నిలిచింది. ఇదే వరుసలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రూ.557 కోట్లతో - సీపీఎం రూ.432 కోట్లతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. 11 ఏండ్లకాలంలో పార్టీ ఫండ్‌ ను బీజేపీ 700శాతం పెంచుకోగా - కాంగ్రెస్ కేవలం 169శాతం వృద్ధిని సాధించింది.

కాగా, పార్టీ నిధిని గణనీయంగా పెంచుకున్న పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్ ముందుంది. 11 ఏళ్ల‌లో ఆ పార్టీ 13,447శాతం వృద్ధిని సాధించింది. బీఎస్పీ పార్టీ నిధి 1,194శాతం పెరిగింది. 2004-05లో ఏడు జాతీయ పార్టీల ఆస్తుల సగటు విలువ రూ 61.62 కోట్లు కాగా - 11 ఏళ్లలో అది రూ388.45 కోట్లకు పెరిగింది.
Tags:    

Similar News